ఫోన్ ట్యాపింగ్ కేసు - కేంద్రమంత్రి బండి సంజయ్ ఏం చెప్పబోతున్నారు?
* క్లైమాక్స్ కు చేరుకున్న ఫోన్ ట్యాపింగ్ విచారణ
* కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సిట్ నోటీసులు
* 24న విచారణకు రావాలని సూచించిన అధికారులు
*స్టేట్ మెంట్ ఇచ్చేందుకు బండి సంజయ్ అంగీకారం
* ఫోన్ ట్యాపింగ్ అంశంపై తొలిసారి మాట్లాడిన బండి సంజయ్
* 2022లోనే కేసీఆర్ ప్రభుత్వంపై ఆరోపణలు
* నేడు నిజమవుతున్న బండి సంజయ్ వ్యాఖ్యలు
తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ కు ఆయన నివాసంలోనే సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 24న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని బండిసంజయ్ తోపాటు సిబ్బందికి కూడా సిట్ అధికారులు సూచించారు. నోటీసులపై బండి సంజయ్ స్పందిస్తూ... ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసుల నుంచి నోటీసులు అందాయని తెలిపారు. తనతో పాటు కుటుంబం, సిబ్బంది ఫోన్లు ట్యాప్ చేశారని.. పడకగదిలో దంపతులు మాట్లాడుకునే మాటలు కూడా ట్యాప్ చేసి వారి జీవితాలను నాశనం చేశారని.. ఈ వ్యవహారంలో తన వద్ద ఉన్న సమాచారాన్ని చెప్తానని బండి సంజయ్ ప్రకటించారు. హైదరాబాద్ లోని దిల్ కుష్ గెస్ట్ హౌస్ లో విచారణకు తాను సిమద్ధమని బండి సంజయ్ సూచించారు. ఈ మేరకు బండి సంజయ్ తోపాటు పీఆర్వో పసునూరు మధు, పీఏ బోయినిపల్లి ప్రవీణ్ రావు, మాజీ పీఏ పోగుల తిరుపతి వాంగ్మూలాలను రికార్డు చేయనున్నారు. మరోవైపు కొద్దిరోజుల క్రితమే బండి సంజయ్ డ్రైవర్ రమేశ్ వాంగ్మూలం రికార్డు చేశారు.
2022లోనే ఫోన్ ట్యాపింగ్ ను ప్రస్తావించిన బండి సంజయ్
తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మొదటిసారి బండి సంజయ్ వెలుగులోకి తెచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తనను నేరుగా ఎదుర్కొనే దమ్ములేక కేసీఆర్ ప్రభుత్వం తనతోపాటు కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది ఫోన్లు ట్యాపింగ్ చేసి నీచానికి ఒడిగడుతోందని 2022లోనే బండి సంజయ్ సంచలన అరోపణలు చేశారు. నాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డితోపాటు జడ్జీలు, ప్రతిపక్ష నేతలు, హీరోయిన్లతోపాటు బీఆర్ఎస్ నేతల ఫోన్లనూ కేసీఆర్ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందంటూ అప్పట్లోనే బండి సంజయ్ అనేక వేదికలపై ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముఖ్య నేతలతోపాటు బీఆర్ఎస్ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో సిట్ పలువురు నేతలను పిలిచి వాంగ్మూలం తీసుకుంటోంది. ఈ అంశంపై విచారణ జరుపుతున్న స్పెషల్ ఇన్వెస్ట్ గేషన్ టీం పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, ప్రముఖులను విచారణకు పిలిచి స్టేట్ రికార్డ్ చేసింది.
మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మొదటిసారి 2022లోనే వెలుగులోకి తెచ్చిన బండి సంజయ్ ని.. విచారణకు పిలవడంతో.. ఇక ఈ కేసు క్లైమాక్స్ కు చేరినట్టేనని భావిస్తున్నారు. సంజయ్ స్టేట్ మెంట్ తర్వాత ఈ కేసు ఓ కొలిక్కివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.