పేదలకు గుడ్ న్యూస్.. నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ
* నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ
* 6 నెలల్లో 5.61 లక్షల కొత్త రేషన్ కార్డులు
* 3.10 కోట్ల మందికి ఆహార భద్రత
* నల్గొండ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్
కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రజలకు రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగసభ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభిస్తారు. ఈకార్యక్రమంలో పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తోపాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొంటారు.
రాష్ట్రవ్యాప్తంగా 5,61,343 మందికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు. వీటిద్వారా 45,34,430 మందికి లబ్ధి కలగనుంది. ఇప్పటి వరకు 89,95,282 కార్డులతో 2,81,47,565 మందికి లబ్ధికలిగితే... కొత్త కార్డుల జారీతో 95,56,625 రేషన్ కార్డుల ద్వారా 3,09,30,911 మందికి లబ్ధి కలుగుతుంది. తెలంగాణలో కొత్తగా ఇవ్వబోతున్న రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వంపై ఏడాదికి అదనంగా రూ.1150.68 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
కేసీఆర్ పాలనలో ఇచ్చింది 45వేల కార్డులే..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నర సంత్సరాల్లో కేవలం 45 వేల రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చిందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈఏడాది జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించింది. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందించాలన్పదే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు. కొత్త రేషన్ కార్డులతో 3.10 కోట్ల మందికి ఆహార భద్రత కలిగిస్తున్నామని.. ఒక్కొక్కరికీ ఉచితంగా 6 కిలోల సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.