కరవు వస్తే గడ్డి తెచ్చి పశువులను కాపాడిన పార్టీ తెలుగుదేశం
సమస్య వస్తే పరిష్కరించేవరకూ నిద్రపోను
రాయలసీమకు నీరు ఇచ్చానన్న సంతృప్తి ఎప్పటికీ మర్చిపోలేనిది
హంద్రీనీవా ప్రాజెక్టు నీటితో బాగుపడే రైతులందరికీ శుభాకాంక్షలు
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాలలో పర్యటనలో సీఎం
రాయలసీమకు నీరు ఇచ్చానన్న సంతృప్తి ఎప్పటికీ మర్చిపోలేనిదని సీఎం చంద్రబాబు వెల్లడించారు. హంద్రీనీవా ప్రాజెక్టు నీటితో బాగుపడే రైతులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాలలో సీఎం పర్యటించారు. జలహారతి కార్యక్రమంలో భాగంగా మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి హంద్రీనీవాకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతులతో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు.
‘‘రాయలసీమ కరవు, కష్టాలు, ప్రజల బాధలు తెలుసన్నారు. అనంతపురంలో కరవు వస్తే గడ్డి తెచ్చి పశువులను కాపాడిన పార్టీ తెలుగుదేశమన్నారు. రాయదుర్గం ఎడారిగా మారకుండా చర్యలు తీసుకున్నామన్నారు. హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగుగంగకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. హంద్రీనీవా నీరు 550 కి.మీ ప్రవహించి చిత్తూరు, కుప్పం వరకు వెళ్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మల్యాల ద్వారా సుమారు 4 టీఎంసీల నీరు తీసుకెళ్లవచ్చు. కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి, పీఏబీఆర్, మారాల, గొల్లపల్లి, చెర్లోపల్లి, మదనపల్లె, చిత్తూరుకు నీరిచ్చే అవకాశం వస్తుందని చంద్రబాబు తెలిపారు. సమస్య ఎదురైతే సవాలుగా తీసుకొని పనిచేసే మనస్తత్వం తనదన్నారు. వేరే రాష్ట్రానికి వెళ్తున్న కియాను అనంతపురం తీసుకొచ్చానన్నారు.
జగన్ పాలనలో సర్వనాశనం
ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని నాశనం చేశారంటూ మాజీ సీఎం జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. రాయలసీమకు రూ.2 వేల కోట్లు కూడా వైకాపా ఖర్చు చేయలేదన్నారు. హంద్రీనీవాకు కనీసం రూపాయి ఖర్చుపెట్టారా? అని ప్రశ్నించారు. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది టీడీపీ ప్రభుత్వమే అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, గండికోట వచ్చాయన్నారు.