నిందితురాలిని బాధితురాలిగా చిత్రకరించొద్దంటున్న మృతుడు తలాల్ కుటుంబం!
కేరళ నర్సు నిమిష ప్రియకు శిక్షపడాల్సిందేనని పంతం
కేరళ నర్సు నిమిష ప్రియకు విధించిన మరణశిక్షను యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది. కేంద్రం, కేరళలోని మత గురువు అబుబాకర్ ముస్లియార్ యెమన్ ప్రభుత్వంతో జరిపిన చర్చలు, సంప్రదింపుల కారణంగా దయతలచిన యెమన్ ప్రభుత్వం ఉరిశిక్షను వాయిదా వేసింది.. బ్లడ్ మనీ ఇచ్చి ఉరిశిక్ష నుంచి తప్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది.
ఇదిలా ఉంటే మృతుడు తలాల్ అదిబ్ మెహది కుటుంబం మాత్రం నిమిషకు శిక్షపడాల్సిందేనని పట్టుబడుతోంది. ఆమె నేరానికి క్షమాపణ ఉండదని తలాల్ అన్న అబ్దుల్ ఫతా మెహది స్పష్టం చేశారు. మధ్యవర్తిత్వం, సయోధ్యల కోసం జరుగుతోన్న ప్రయత్నాలు కొత్తేమీ కావు. ఇవి మాకేం ఆశ్చర్యంగా అనిపించడం లేదు కానీ, నిమిష ప్రియకు శిక్షపడడమే తమకు జరిగే అసలైన న్యాయమని అబ్దుల్ పేర్కొన్నారు. క్షమాధనానికి(బ్లడ్ మనీ) అంగీకరించబోమని కుండబద్దలుకొట్టారు.
తన సోదరుడిని చంపిన నిమిష ప్రియకు శిక్ష వాయిదాను తాము ఊహించలేదని అబ్దుల్ వెల్లడించారు. డబ్బుతో మనిషి ప్రాణానికి వెలకట్టలేమని తమ కుటుంబానికి బ్లడ్ మనీ అక్కరలేదన్నారు. మాకు కావల్సింది న్యాయమేనన్నారు. నిందితురాలిని బాధితురాలిగా చూపెట్టేందుకు , ఆమె చేసిన నేరాన్ని వక్రీకరించే ప్రయతం చేయొద్దని హితవు పలుకుతూ ఫేస్ బుక్ లో అబ్దుల్ పోస్ట్ పెట్టారు.
తాజా పరిణామాల నేపథ్యంలో నిమిష ప్రియకు విధించిన శిక్ష వాయిదా రద్దవుతుందా..శిక్షే రద్దవుతుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రజాశాంతి పార్టీ అధినేత డాక్టర్ కేఏ పాల్ సైతం నిమిష ప్రియకు శిక్షను రద్దు చేయడానికి కృషి చేస్తున్నారు. యెమన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. ప్రధాన మంత్రి మోదీ లేదా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తన చర్చలకు మద్దతుగా ఒక్క ట్వీట్ చేస్తే తాను నిమిష ప్రియను క్షేమంగా ఇండియాకి తీసుకువచ్చి అప్పగిస్తానని చెబుతున్నారు.