కడప విద్యార్థిని హత్య కేసులో కీలక మలుపు!..చంపిందెవరు? పోలీసుల మల్లగుల్లాలు
గండికోట ఇంటర్ విద్యార్థిని హత్య కేసు కీలక మలుపు తిరిగింది. జమ్మలమడుగు మండలంలోని పర్యాటక స్థలం గండికోటలో జరిగిన ఇంటర్ బాలిక హత్య కేసు సంచలనం రేపింది. ఈ కేసులో బాలిక ప్రియుడైన లోకేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.బాలిక కాలేజీకి వెళ్లకుండా ప్రియుడితో కలిసి గండికోటకు వెళ్లింది. కానీ తర్వాత రోజు ఉదయం ఆమె మృతదేహం గండికోట వద్ద కనిపించడం కేసును మరింత మలుపు తిప్పింది. మొదట్లో ఈ హత్యపై అనేక అనుమానాలుంటే ఇప్పుడు ఇది పరువు హత్యగా మారుతున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
ప్రియుడు లోకేశ్ చెప్పిన కథనం ప్రకారం.. బాలిక బంధువులు గండికోటకు వచ్చి ఆమెను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో తాను ఒక్కడే తిరిగి వచ్చానని లోకేష్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అయితే మృతదేహం ఆధారంగా తీసిన వైద్య నివేదికలు మాత్రం బాలికను అర్థరాత్రి తర్వాత హత్య చేసినట్లు చెబుతున్నాయి. మరో ముఖ్యమైన అంశం తేలిందేంటంటే విద్యార్థినిపై లోకేశ్ గానీ...ఇతరులు కానీ అత్యాచారం చేయలేదని దర్యాప్తులో స్పష్టమైంది. అంటే గండికోటకు వెళ్లిన తర్వాత వెంటనే హత్య జరగలేదని స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు చివరికి పరువు హత్య కోణంలో దర్యాప్తు చేపట్టారు. విద్యార్థినిని వివస్త్రగా చెట్ల పొదల్లో పడేయడం వెనకున్న కారణాలు సహా కేసుకు సంబంధించి పలు కీలక ఆధారాలు సేకరించామని, త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తామని కడప ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు.
ప్రస్తుతం కేస్ అప్డేట్ చూస్తే, గండికోటలో హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని కేసు కొలిక్కిరాలేదు. ఈ నెల 14న గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్యకు గురైంది. అసలు నిందితులు ఎవరనేది గుర్తించేందుకు పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. సరైన ఆధారాలు లభించకపోవడంతో మళ్లీ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మూడు రోజుల నుంచి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జమ్మలమడుగులోనే మకాం వేశారు. పోలీసులు మళ్లీ మొదటి నుంచి అనుమానితులందరినీ ప్రశ్నిస్తున్నారు. సాంకేతికపరమైన ఆధారాల కోసం ఆరా తీస్తున్నారు.
మరోసారి గండికోట ప్రాంతంలో సీసీటీవీ దృశ్యాలను సాంకేతిక బృందం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది. బుధవారం డీఐజీ ఆధారం లభించిందని చెప్పినా.. వాటి నిర్ధరణ కోసం పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. లోకేశ్ అనే యువకుడిని పోలీసులు మరోసారి ప్రశ్నించారు. గండికోటలో ప్రైవేటు గదులు అద్దెకిస్తున్న యజమానులను ప్రశ్నిస్తున్నారు.