అడవిని మింగేస్తున్న బొగ్గు బట్టీలు..! తగ్గిపోతున్న వృక్ష సంపద
అనంతపురం జిల్లాలో చట్టవిరుద్ధంగా బొగ్గు బట్టీలు
అటవీ అధికారులు హెచ్చరించినా లెక్కచేయని వైనం
కఠిన చర్యలు తప్పవంటున్న అటవీ శాఖ
Jeevan Kumar
TPN, Anantapuram
అనంతపురం జిల్లా కంబదూరు మండలం పాళ్లూరు పంచాయతీ పరిధిలోని యర్రమల్లెపల్లి సమీపంలో చట్ట విరుద్ధంగా బొగ్గుల బట్టిల నిర్వహణపై అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సూర్యనారాయణ గురువారం బొగ్గుల బట్టిని తనిఖీ చేసి ఎలాంటి అనుమతులు లేకుండా బొగ్గులు తయారు చేసి పెద్ద ఎత్తున కర్ణాటకకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా బొగ్గుల తయారీకి చింత , వేప వంటి విలువైన వృక్షాలను వినియోస్తున్నట్లు విచారణలో తేలింది. మూడేళ్ల నుంచి అక్రమంగా నిర్వహిస్తున్న బట్టీ నిర్వాహకులకు గతంలోనే జరిమానా విధించినా ఈ దందాకు అడ్డకట్ట పడలేదు. అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకోకుండా చింత, వేప వంటి విలువైన చెట్లు నరికి బొగ్గులు తయారీకి ఉపయోగించి అడవిలోని విలువైన వృక్ష సంపదను వారి ఆదాయాలకు అనుకూలంగా మార్చుకోవడంపై పలురకాల ఆరోపణలు వస్తున్నాయి.
అడవికి 5 కిలోమీటర్లు ఎక్కడ బొగ్గుల బట్టి నిర్వహించకూడదనే నిబంధనలు ఉన్నా అవేమీ ఇక్కడ అమలు కావడం లేదు. ఈ విషయంపై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ను వివరణ కోరగా కాల్చిన బొగ్గు సంచులు 150 బ్యాగులు గుర్తించామని, కాల్చడానికి సిద్ధంగా ఉన్న వాటిని కాల్చకూడదని నిర్వాకులకు చెప్పినట్టు తెలిపారు. వీటన్నింటి పైన పెనాల్టీ వేస్తామని వెల్లడించారు. అయినప్పటికీ నిబంధనలు అతిక్రమించి బొగ్గుల తయారీకి అనుమతి లేకుండా మొదలు పెడితే కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తామన్నారు. కైరవు ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని ఎలాంటి అనుమతులు లేకుండా బొగ్గుల బట్టిలు నిర్వహించకూడదని ఎవరైనా నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారం బొగ్గుల బట్టి నిర్వహించడం, చింత , వేప వంటి విలువైన వృక్ష సంపదను నరికి రవాణా చేసిన డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ అదేశాల మేరకు చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బెదిరింపులకు గురిచేస్తున్నారు: బొగ్గుల బట్టి నిర్వాహకులు
ఇదిలా ఉండే గత మూడేళ్లుగా తాము ఇక్కడ బొగ్గుల బట్టీ నిర్వహిస్తున్నామని.. తమ బ్రతుకుదెరువు ఇదేనని నిర్వాహకులు వాపోతున్నారు. చాలా మంది తమను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని.. ఒక్కొక్కరికి రూ.3వేల నుంచి 5వేల వరకు చెల్లించామని.. స్థానిక గ్రామ సర్పంచ్ కూడా తమను బెదిరించి రూ.35 వేలు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. తమ దగ్గర డబ్బులు వసూలు చేసిన వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.