స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. 100ఏళ్ల ఆకాంక్ష నెరవేర్చాం: సీఎం రేవంత్
* స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు
* సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపిన బీసీ నేతలు
* హామీ ఇచ్చినట్టే కులగణన చేసి చూపించాం
* రాహుల్, ఖర్గేల సహకారంతోనే సాధ్యమైందన్న సీఎం రేవంత్
స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడం కాంగ్రెస్ పార్టీ సాధించిన గొప్ప విజయమన్నా సీఎం రేవంత్‌రెడ్డి. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా బీసీల 100ఏళ్ల ఆకాంక్షను రాహుల్ గాంధీ, ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ నెరవేర్చిందన్నారు. రిజర్వేషన్ ఫలాలను బీసీలు సద్వినియోగం చేసుకోవాలని రేవంత్ సూచించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పార్టీలోని బీసీ నాయకులు హర్షం వ్యక్తంచేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చినందుకు సీఎం రేవంత్ ను కలిసి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇతర నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేంనరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్లు గొప్ప కార్యక్రమం..
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కులగణన చాలా పకడ్బందీగా చేశామని.. ఇది దేశానికే ఉత్తమ మోడల్ అని అభివర్ణించారు. ప్రజలు స్వచ్ఛందంగా కులగణనకు వివరాలు వెల్లడించారని. ఆ సమాచారాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేసి భద్రపరిచామని ఆయన తెలిపారు. ఆనాడు దళితులు, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీనేని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను కూడా సోనియా గాంధీ నెరవేర్చారన్నారు. కులగణన చేస్తామని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో స్పష్టంగా చెప్పారు. నాయకుడు మాట ఇస్తే దాన్ని నేరవేర్చాల్సిన బాధ్యత నాది, మా పీసీసీ అధ్యక్షుడిదని.. కులగణనపై అనేక అవాంతరాలు వచ్చినా వాటిని అధిగమించి ఏడాదిలో పారదర్శకంగా, పక్కాగా కులగణన పూర్తి చేశామని రేవంత్ అన్నారు.
చట్టం చేసిన కేసీఆర్ ఇప్పుడు బీసీ నేతలను ఉసిగొల్పుతున్నారు
గతంలో కేసీఆర్ ప్రభుత్వం 50శాతం మించి రిజర్లేషన్లను పెంచొద్దని పంచాయతీరాజ్ చట్టం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆ చట్టం చేసినప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. ఇప్పుడు వారినే కేసీఆర్ మా ప్రభుత్వంపైకి ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన చట్టంలో 50శాతం నిబంధనను సవరిస్తూ ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకువచ్చామని రేవంత్ తనను కలిసిన బీజేపీ నేతలతో అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తాపత్రయం పడుతున్న తనకు తోడుగా, రక్షణ కవచంలా ఉంటూ రిజర్వేషన్లను కాపాడుకోవాలన్నారు. అన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలు అయితేనే బీసీలది నిజమైన విజయమని.. 2029 ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లే ప్రధాన జెండా కావాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
బీజేపీ నేతలు చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన నిర్ణయం దేశాన్ని ప్రభావితం చేసిందన్నారు. గతంలో కులగణనకు తాము వ్యతిరేకమని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన బీజేపీ ఇప్పుడు.. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితో కేంద్రం 2026 లో జరిగే జనగణనతోపాటే కులగణన చేయాలని నిర్ణయించిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. బీజేపీకి బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. 9వ షెడ్యూల్ లో చేర్చి చట్టబద్దత కల్పించాల్సింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఇందుకోసం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, ఆర్ క్రిష్ణయ్య ప్రయత్నించాలని సూచించారు. ఈ విషయంలో ప్రధాని మోడీని ప్రశ్నించి బీజేపీ నాయకులు వాళ్ల నిబద్ధతను చూపించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.