దంచికొట్టిన వాన.. హైదరాబాద్ అతలాకుతలం..!

By TVK
On
దంచికొట్టిన వాన.. హైదరాబాద్ అతలాకుతలం..!

నగరాన్ని ముంచెత్తిన వాన
ఆరెంజ్‌ అలర్ట్‌ ఇచ్చిన వాతావరణశాఖ
భారీ నుంచి అతిభారీ వర్షం పడే ఛాన్స్
రోడ్లపైకి వరద నీరు.. భారీగా ట్రాఫిక్‌ 
ట్రాఫిక్ కష్టాలతో జనజీవనం అస్తవ్యస్తం

 

హైదరాబాద్ నగరంలో జనజీవనం మరోసారి స్తంభించిపోయింది. భారీ వర్షానికి ప్రధాన రహదారులన్నీ జలమయ్యాయి. రోడ్లపైకి వరద నీరు భారీగా చేరడంతో పలుచోట్ల వాహనదారులు వరద నీటిలో చిక్కుకున్నారు. భారీ వ‌ర్షానికి అనేక ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. కొన్ని లోత‌ట్టు  ప్రాంతాల్లో న‌డుంలోతు వ‌ర‌ద నీరు ఇళ్ల‌ను ముంచెత్తింది. భారీ వర్షం కారణంగా ఐటీ సెక్టార్‌ ఏరియాలో ట్రాఫిక్‌ కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. గచ్చిబౌలి, మాదాపూర్‌, కొండాపూర్‌, బయోడైవర్సిటీ, రాయదుర్గంలో భారీగా వాహనాలు రోడ్లపై నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. యూసఫ్‌గూడ, కృష్ణానగర్‌ ప్రాంతాల్లో పైనుంచి వచ్చిన వరద నీటితో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. 

అటు మియాపూర్, కూకట్‌పల్లి, ప్రగతినగర్‌, మూసాపేట, అమీర్‌పేట, బేగంపేట, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, నాంపల్లి, కోఠి, చాదర్‌ఘాట్‌, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ ఏరియాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఉప్పల్ ఏరియాలో కురిసిన వర్షానికి వరదనీరు రోడ్డుపైకి చేరి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉప్పల్‌ స్టేడియం నుంచి హబ్సీగూడ వరకు ట్రాఫిక్‌జామ్ ఏర్పడి వాహనదారులు నరకం అనుభవించారు. ట్రాఫిక్‌జామ్‌ కావడంతో వాహనాలను క్లియర్‌ చేసేందుకు ట్రాఫిక్‌ పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మారేడ్‌పల్లిలో అత్యధికంగా 11.28 సెంటీమీటర్లు, ముషీరాబాద్‌లో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్
నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. జీహెచ్ఎంసీతోపాటు హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్ , విద్యుత్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.

నీట మునిగిన ప్రాంతాల్లో హైడ్రా సేవలు
రసూల్‌పురలోని పైగా కాలనీలోని కార్ల షోరూమ్‌లోకి భారీగా వరద చేరడంతో అందులో పనిచేసే 30 మంది భయాందోళనకు గురయ్యారు. డీఆర్‌ఎఫ్‌, హైడ్రా అధికారులకు షోరూమ్‌ సిబ్బంది ఫోన్ చేసి రక్షించాలని కోరారుు. వెంటనే హైడ్రా సిబ్బంది రంగంలోకి  బోట్ల సహాయంతో లోపల ఉన్న సిబ్బందిని బయటకు తీసుకువచ్చారు. మరోవైపు ప్యాట్నీ ప‌రిధిలో నీట మునిగిన ప్రాంతాల్లో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ పర్యటించారు. స్థానికంగా ప్రజలకు అందుతున్న స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షించారు. హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు.. మాన్సూన్ ఎమ‌ర్జ‌న్సీ టీమ్‌లు కూడా రంగంలో దిగాయి.  ప్ర‌తి ఏటా వ‌ర్షాకాలం త‌మ కాల‌నీలు నీట మునుగుతున్నాయ‌ని ఫిర్యాదుల నేప‌థ్యంలో ప్యాట్నీ నాలా విస్త‌ర‌ణ‌కు హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంది. అయితే ఓ ఇంటి య‌జ‌మాని ప‌నుల‌ను అడ్డుకోవ‌డంతో ఆగిపోయాయి. దీంతో గ‌తంలో మాదిరే స‌మ‌స్య త‌లెత్తింద‌ని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇళ్ల‌లో చిక్కున్న వారిని డీఆర్ ఎఫ్ సిబ్బంది బోట్ల సాయంతో సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. అంబ‌ర్‌పేట‌లోని బ‌తుక‌మ్మ కుంట‌కు భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరింది. గ‌తంలో వ‌ర‌ద నీటితో లోత‌ట్టు ప్రాంతాలు నీట మునిగేవ‌ని.. ఇప్పుడు చెరువు ఆ వ‌ర‌ద‌ను ఆపుతోంద‌ని స్థానికులు తెలిపారు. 

మరోవైపు రాత్రి కూడా జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షం కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. నగరవాసులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.  

Advertisement

Latest News

దంచికొట్టిన వాన.. హైదరాబాద్ అతలాకుతలం..! దంచికొట్టిన వాన.. హైదరాబాద్ అతలాకుతలం..!
నగరాన్ని ముంచెత్తిన వానఆరెంజ్‌ అలర్ట్‌ ఇచ్చిన వాతావరణశాఖభారీ నుంచి అతిభారీ వర్షం పడే ఛాన్స్రోడ్లపైకి వరద నీరు.. భారీగా ట్రాఫిక్‌ ట్రాఫిక్ కష్టాలతో జనజీవనం అస్తవ్యస్తం  
వేల ఎన్ కౌంటర్లు..వందల మంది హతం..తప్పు చేస్తే అక్కడంతే!
మిథున్ రెడ్డికి సుప్రీం కోర్టు షాక్.. మద్యం కేసులో అరెస్టుకు రంగం సిద్ధం!
దేశవ్యాప్తంగా బిల్లులు బెంబేలెత్తిస్తుంటే అక్కడ మాత్రం ఫ్రీ కరెంట్!
తల్లికి వందనం..'ప్రైవేటు'కు వరం..ప్రభుత్వ బడులకు విద్యార్థులు దూరం!
బీఆర్‌ఎస్‌కు దూరమవుతున్నట్టేనా?
నామినేటెడ్ పదవుల జాతర.. 66 మంది చైర్మన్లు వీళ్లే ..!