బీఆర్‌ఎస్‌కు దూరమవుతున్నట్టేనా?
* బీఆర్‌ఎస్‌లో క్లైమాక్స్‌కు ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్
* బీసీ రిజర్వేషన్లపై పార్టీ వైఖరిని తప్పుపట్టిన కవిత
* పార్టీ వైఖరిని కాదని.. బీసీ రిజర్వేషన్లను సమర్ధించిన కవిత
* బీఆర్‌ఎస్ నా దారికి రావాల్సిందేనని ప్రకటన
* కేసీఆర్, బీఆర్ఎస్ చేస్తుందోనని కేడర్‌లో ఆసక్తి
భారత రాష్ట్ర సమితి (BRS)లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ క్లైమాక్స్‌కు చేరినట్టేనా? ఇన్నాళ్లూ కొందరు నాయకులను మాత్రమే తప్పుపడుతూ వచ్చిన కవిత.. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ప్రకటించిన బీసీ రిజర్వేషన్లపై పార్టీ వైఖరిని తప్పుపట్టడం దేనికి సంకేతం? ఇక కేసీఆర్‌తో తాడోపేడో తేల్చుకోవడానికే సిద్ధమయ్యారా? తన దారికే బీఆర్ఎస్ రావాల్సిందేనని ప్రకటించడం దేనికి సంకేతం? ఇంత జరుగుతున్నా కేసీఆర్ నిర్ణయం ఏంటి? పార్టీ నుంచి కవిత వెళ్ళిపోయేలా చేస్తారా? లేక వేటు వేస్తారా? ఇవీ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల మనసులో మెదులుతున్న ప్రశ్నలు. మరికొద్దిరోజుల్లోనే కవిత ఎపిసోడ్‌కు సమాధానం లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
కేసీఆర్‌పై తిరుగుబాటేనా?
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో ఎమ్మెల్సీ కవిత వ్యవహారం అంతకంతకూ ముదురుతోంది. నిన్న మొన్నటి వరకు పార్టీలో కోవర్డులున్నారంటూ విమర్శిస్తూ వచ్చిన కవిత.. ఇప్పుడు ఏకంగా పార్టీ వైఖరినే ప్రశ్నించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు వర్తింపజేసే ఆర్డినెన్స్ రేవంత్ ప్రభుత్వం తీసుకురావడంపై కవిత వైఖరి.. బీఆర్ఎస్ వైఖరికి భిన్నంగా ఉంది. మే నెలలో పార్టీ అధ్యక్షుడు, తన తండ్రి కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ బయటకు లీక్ అవడంతో వివాదం మొదలైంది. కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నాయని.. మరో సందర్భంలో పరోక్షంగా కేటీఆర్, హరీష్‌రావులను తప్పుపడుతూ వచ్చారు. అయినా కేసీఆర్ స్పందించలేదు. కవిత వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూ ఇప్పుడు ఏకంగా పార్టీ నిర్ణయాన్ని ప్రశ్నించే స్థాయికి చేరింది. అంటే ఇక కేసీఆర్‌పై తిరుగుబాటుకు సిద్ధమైనట్టేనన్న చర్చ మొదలైంది.
ధిక్కార స్వరం పెంచిన కవిత
తెలంగాణలో బీసీ రిజర్వేషన్స్ విషయంలో బీఆర్‌ఎస్ వైఖరి ఒకలా ఉంటే.. ఎమ్మెల్సీ కవిత మరోలా వ్యవహరిస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తెస్తే చాలదని.. దానికి చట్టబద్ధత కల్పించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అయితే కవిత మాత్రం ప్రభుత్వాన్ని సమర్ధించడమే కాకుండా వేడుకలు కూడా నిర్వహించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ నేతలు దిష్టిబొమ్మ దహనం చేస్తే.. పనీపాటా లేదు కాబట్టి దిష్టిబొమ్మ దహనం అంటూ పార్టీకే కౌంటర్ ఇచ్చారు కవిత. న్యాయ నిపుణులను సంప్రదించిన తర్వాతే ఆర్డినెన్స్‌కి మద్దతుగా మాట్లాడుతున్నానని కవిత తన వైఖరిని సమర్థించుకున్నారు. ఎప్పుడైనా ఈ విషయంలో బీఆర్‌ఎస్ నా దారికి రావాల్సిందేనన్నారు.
పార్టీ వైఖరి ఎలా ఉండబోతోంది?
తాజా ఎపిసోడ్ తర్వాత కవితకు, బీఆర్ఎస్‌కు దూరం మరింత పెరిగినట్టేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కవిత అయితే సొంతంగా ముందకు వెళ్లాలని నిర్ణయించుకునే.. బీసీ అజెండాను ఎత్తుకుని రాజకీయం చేస్తున్నారు. సాధారణంగా కేసీఆర్ వైఖరిని ప్రశ్నించే ధైర్యం పార్టీలో ఎవరూ చేయరు. ప్రశ్నించిన నాయకులకు ఉనికిలేకుండా చేయడం కేసీఆర్ వైఖరి. కాబట్టి ఇప్పుడు కవితను కూడా అలాగే వదిలేస్తారా? పరిస్థితి చేయిదాటే వరకు ఎదురుచూస్తారా? తనంతట తానుగా బయటకు వెళ్లేలా తెరవెనుక నుంచి ప్రయత్నాలు చేయిస్తారా? అనేది వెయిట్ అండ్ సీ.