దేశవ్యాప్తంగా బిల్లులు బెంబేలెత్తిస్తుంటే అక్కడ మాత్రం ఫ్రీ కరెంట్!
దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో చూసినా కరెంట్ బిల్లులు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. కానీ ఆ రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం కరెంట్ ఫ్రీ అని ప్రకటించింది
అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నవేళ..బీహార్ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఉచిత విద్యుత్ పథకాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు. గృహ వినియోగదారులందరికీ ప్రతి నెలా 125 యూనిట్ల విద్యుత్ ఉచితంగా పంపిణీ చేస్తామని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీనివల్ల 1.67 కోట్ల కుటుంబాలకు లబ్ది చేకూరుతోందన్నారు. ఉచిత విద్యుత్ పథకాన్ని ఆగస్ట్ నుంచే అమల్లోకి తీసుకు వస్తున్నట్లు సీఎం నితీశ్ స్పష్టం చేశారు. అంటే జూలై కరెంట్ బిల్లు కూడా కట్టనవసరం లేదన్నమాట. 125 యూనిట్ల విద్యుత్ వాడకంపై బిల్లు వసూలు చేయరు.
ఇప్పటికే బీహార్ ప్రజలకు చౌకగా విద్యుత్ సరఫరా అందిస్తోంది. వచ్చే మూడేళ్లలో 'కుటీర్ యోజన పథకం' కింద రాష్ట్రంలో 10వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముందుకువెళుతోంది. గృహ వినియోగదారులకు 125 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం వల్ల..బీహార్ ప్రభుత్వ ఖజానాపై రూ.16వేల కోట్ల భారం పడనుంది. మరోవైపు ఇండియా కూటమికి సారథ్యం వహిస్తోన్న ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్..తమకు అధికారమిస్తే గృహ వినియోగదారులకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది.