మిథున్ రెడ్డికి సుప్రీం కోర్టు షాక్.. మద్యం కేసులో అరెస్టుకు రంగం సిద్ధం!
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీం కోర్టు షాక్
ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన సుప్రీం
మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం!
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసింది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. అరెస్ట్ చేయకుండా ఛార్జ్ షీట్ దాఖలు చేయడంపైనా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. తీవ్రమైన ఆరోపణలున్న నేపథ్యంలో ముందస్తు బెయిల్ పొందడానికి ఎలాంటి కారణాలున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. విచారణ అనంతరం ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. ఇటీవల ఏపీ హైకోర్టు సైతం మిథున్ బెయిల్ పిటిషన్ ను తొసిపుచ్చడంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించగా అక్కడ సైతం చుక్కెదురైంది.
ఈ కేసులో సిట్ అధికారులు మిథున్ రెడ్డిపై ఇప్పటికే లుకౌట్ సర్కులర్ జారీ చేశారు. బెయిల్ పిటిషన్ కొట్టివేసే అవకాశముండటంతో ఇప్పటికే మిథున్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన ఆచూకీ కోసం సిట్ ప్రత్యేక బృందాలను నియమించింది. గతంలోనూ ఈ కేసులో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లి ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఐతే అప్పటికి ఆయన పేరును నిందితుల జాబితాలో చేర్చకపోవడంతో హైకోర్టు కొట్టివేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో మిథున్ రెడ్డి ఆచూకీ తెలిసిన వెంటనే ఆయన్ను సిట్ అదుపులోకి తీసుకునే అవకాశముంది.
ఇదిలా ఉంటే మద్యం కుంభకోణంలో అంతిమంగా లబ్ధిపొందిన వ్యక్తి తర్వాతి అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ పేర్కొంది. వైసీపీ ప్రభుత్వంలో నెం.1గా, సీఎం తర్వాత అంతటి శక్తివంతమైన నేతగా పేరుపొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడైన మిథున్ రెడ్డి.. మాజీ సీఎం జగన్ కు చాలా దగ్గరి వ్యక్తి. పాలిటిక్స్ లోకి రాకమునుపే జగన్ కు క్లోజ్ ఫ్రెండ్. అంతేకాదు ఎన్నికల్లో వైసీపీకి నిధుల సమీకరణ బాధ్యత కూడా ఆయనదే. ఢిల్లీలో జగన్ తరపున వ్యవహారాలు చక్కబెట్టేది కూడా ఆయనే.
మద్యం కుంభకోణంలో భాగంగా డిస్టిలరీల ఎంపిక, సరఫరా సంస్థల నుంచి ముడుపుల వసూళ్ల కోసం రాజ్ కెసిరెడ్డితో కలిసి నెట్ వర్క్ రూపొందించడంతో పాటు ఆ మొత్తాన్ని చేరాల్సిన చోటుకు చేరవేయడంలో మిథున్ రెడ్డిదే మెయిన్ రోల్ అని సిట్ తేల్చి చెప్పింది. ముడుపులు ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో వసూలు చేయాలని.. ఎవరి చేతికి వాటిని అందించాలి.. అక్కడి నుంచి ఎక్కడికి చేర్చాలనే అంశాలపై మిథున్ రెడ్డే డైరెక్షన్ ఇచ్చినట్లు సిట్ గుర్తించింది.
అంతేకాదు స్కామ్ కు స్కెచ్ వేసిన సమయంలోనే తమకు నచ్చిన అధికారులను కీలక స్థానాల్లో నియమించి వ్యవహారాన్ని ఎలాంటి తేడాలు రాకుండా డీల్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఐఆర్టీఎస్ అధికారి అయిన వాసుదేవరెడ్డిని ఆగమేఘాలపై డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ, డిస్టిలరీస్, బ్రూవరీస్ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. అంతేకాదు తాము చెప్పినట్లు చేస్తే ఐఏఎస్ గా ప్రమోట్ చేయిస్తామని అసిస్టెంట్ కమిషనర్ సత్యప్రసాద్‌కు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మద్యం ఆర్డర్స్, సప్లై సిస్టమ్ ని మాన్యువల్ పద్దతిగా మార్చడంతో పాటు ఒక్కో కేసుకు ఎంత వసలు చేయాలో నిర్ణయించింది కూడా మిథున్ రెడ్డేననేది సిట్ వాదన.