తెలంగాణలో భారీ దోపిడీ..! 18 కేజీల బంగారం మాయం
తెలంగాణలో భారీ దోపిడీ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. సూర్యాపేట ఎంజీ రోడ్డులోని సాయి సంతోషీ జ్యూవెల్లర్స్ లో దొంగలు పడి ఏకంగా 18 కేజీల బంగారు ఆభరణాలు, రూ.22 లక్షల నగదును దోచుకెళ్లారు. చోరీని దొంగలు పక్కాగా ప్లాన్ చేశారు. ముందుగానే సీసీ కెమెరాలను డిస్ కనెక్ట్ చేసి షాపు వెనుక భాగంలో గోడకు పెద్ద రంధ్రం వేసి ఆ తర్వాత గ్యాస్ కట్టర్ సాయంతో షట్టర్ ను కట్ చేసి లోపలికి చొరబడ్డారు. అంతేకాదు షాపు స్ట్రాంగ్ రూములో ఉన్న ఐరన్ తిజోరీని సైతం గ్యాస్ కట్టర్ తో కట్ చేసి అందులో ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లిపోయారు. షాపులో వెండివస్తువులను మాత్రం ఏమాత్రం టచ్ చేయని దొంగలు కేవలం బంగారు, నగదును మాత్రమే దోచుకున్నారు. దొంగలు దోచుకున్న బంగారం విలుప దాదాపు రూ.17 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
ఆదివారం సెలవు కావడంతో సోమవారం ఉదయం షాపు తెరిచి చూడగా దోపిడీ విషయం వెలుగులోకి వచ్చింది. దోపిడీపై సమాచారం అందుకున్న పోలీసులు డీఎస్పీ ప్రసన్న కుమార్ నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించారు. డాగ్ స్క్వాడ్, క్లూజ్ టీమ్ ను రంగంలోకి దించి ఆధారాలు సేకరించారు.
ఐదు బృందాలతో దొంగల కోసం గాలిస్తున్నారు. షాపు సమీపంలోని సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో పలు చోట్ల ఇదే తరహాలో దోపిడీలు జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ లోని కోహినూర్ జ్యూవెలర్స్ లో రూ.15 కోట్ల విలువైన బంగారం దోపిడీకి గురైంది.