ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 'స్మార్ట్' షాక్!
ప్రతిపక్షంలో ఒకలా..ప్రభుత్వంలోకి వచ్చాక మరోలా
కూటమి ప్రభుత్వంపై స్మార్ట్ మీటర్ల కుంపటి
రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు కూటమి ప్రభుత్వం ‘స్మార్ట్’ షాక్ ఇస్తోంది. స్మార్ట్ మీటర్ల దోపిడి విధానంపై ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పిందని సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "ప్రతిపక్షంలో ఉన్న సమయంలో స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు". ప్రస్తుతం మాట మార్చి బాగున్న డిజిటల్ మీటర్లను తొలగించి మరి స్మార్ట్ మీటర్లను బిగిస్తుండడంపట్ల ప్రజాగ్రహజ్వాల మొదలైంది. ముందు ప్రభుత్వ కార్యాలయాలకు, ఆ తదుపరి షాపులు, పరిశ్రమలు, సంస్థలకు బిగించారు. ఇప్పుడు నివాస గృహాలకూ అమర్చుతున్నారు. వినియోగదారుల ముందస్తు అనుమతి లేకుండా, కనీస అవగాహన కలిగించాలన్న స్పృహ లేకుండా బలవంతంగా కరెంట్ ఆగిపోతుందని బెదిరించి మీటర్లను పెడుతున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా అర్థమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అధిక కరెంటు బిల్లులతో సామాన్యుడి గుండెలలో ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకునే కూటమి ప్రభుత్వ తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బడా కార్పొరేట్ ఆదానీ కంపెనీకి స్మార్ట్ మీటర్లకు పదేళ్ల పాటు నిర్వహణ డీబీఎఫ్‌ఒఒటీ(డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఓన్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్) పద్ధతిలో కాంట్రాక్టును ప్రభుత్వం కట్టబెట్టింది. తొలి దశలో 41 లక్షల కనెక్షన్లకు మీటర్లు పెడుతున్నారు. దశలవారీగా రాష్ట్రంలోని రెండు కోట్ల మంది వినియోగదారుల గృహాలకు మీటర్లను బిగిస్తారు. ఈ విధానం ద్వారా విద్యుత్ రంగాన్ని బడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రైవేటీకరణకు మొదటి మెట్టని మేధావులు అభిప్రాయపడుతున్నారు. దీని పేరే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్. సెల్‌ఫోన్ తరహాలో ముందుగానే డబ్బు చెల్లించి చార్జింగ్ చేయించుకోవాలి. అప్పుడే కరెంటు వస్తుంది. ముందు రూ. 500 తగ్గకుండా బ్యాలెన్స్ వేయించుకోవాలి. బ్యాలెన్స్ అయిపోగానే మళ్ళీ డబ్బు చెల్లించి రీచార్జి చేయించుకోవాలి. లేకపోతే కరెంటు నిలిచిపోతుంది. కంపెనీవారే ఆన్‌లైన్‌లో బిల్లు పంపుతారు. తప్పులు వచ్చినా సమాధానం చెప్పే నాథుడు ఉండరనే కలవరం లేకపోలేదు.
మనిషన్నవాడు ఏనాడూ చూడని విధంగా పగలు ఒక రేటు, రాత్రి ఒక రేటు, వేసవి కాలం ఒక రేటు, చలికాలం మరొక రేటు వసూళ్లు తప్పవు. ఈ విధానాన్ని ”టైం ఆఫ్ ది డే” అని పిలుస్తారు. దీని ప్రకారం ఒక రోజును నాలుగు భాగాలుగా విడగొడతారు. ప్రతి సమయానికి ఒక రేటు నిర్ణయిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల మధ్య ఎక్కువ కరెంటు వినియోగిస్తారు. కాబట్టి, ఆ సమయంలో మరింత ఎక్కువ చార్జీలు వసూలు చేస్తారు. అంటే మనిషికి అవసరమైనపుడు కాకుండా బిల్లు పడనప్పుడు కరెంట్ వినియోగించుకోవలసిన దుస్థితి ఏర్పడుతుంది.
సింగిల్ ఫేజ్ మీటర్‌కు రూ 8,927, త్రీ ఫేజ్ మీటర్‌కు రూ 17,286 అదానీ కంపెనీకి జనం చెల్లించాలి. జిల్లాలను బట్టి రేట్లలో తేడాలు ఉంటాయి. ముందు చెల్లించనవసరం లేదన్నారు. కానీ వాటి ఖర్చును కూడా 93 నెలలలో వాయిదాల పద్ధతిలో ఈ మొత్తం మనపై వసూలు చేస్తారు. రాష్ట్రంలోని రెండు కోట్ల మీటర్లకు దాదాపు రూ.25 వేల కోట్ల భారం జనం నెత్తిన పడుతుంది. బాగున్న పాత మీటర్లు వృధాగా పడేస్తారు. మీటర్లు తయారు చేసేది, బిగించేది, నిర్వహించేది సర్వం అదానీ కంపెనీనే! కాబట్టి వీరి దోపిడికి అడ్డు అదుపు ఉండదు.
స్మార్ట్ మీటర్లు ఎఎంఐ(అడ్వాన్స్‌డ్ మీటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్), ఎఎంఆర్(ఆటోమేటిక్ మీటర్ రీడింగ్) టెక్నాలజీతో ఉంటాయి. మన ఇంటిలోని స్మార్ట్‌మీటర్‌కు, అదానీ కంపెనీకి వైర్‌లెస్ ద్వారా అనుసంధానం చేస్తారు. కంట్రోల్ మొత్తం ప్రైవేటు సంస్థ చేతిలో ఉంటుంది. విద్యుత్ వినియోగాన్ని, డబ్బు వసూళ్లను వారే నియంత్రిస్తారు. పెత్తనం మొత్తం వారిదే. విద్యుత్ ఉత్పత్తి ఇప్పటికే సగభాగం బడా కంపెనీల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు స్మార్ట్ మీటర్ల ద్వారా విద్యుత్తు పంపిణీ కూడా అదానీ వంటి బడా కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయింది. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం వేసిన విద్యుత్ లైన్లు, స్తంభాల నుంచి ప్రైవేట్ కంపెనీలు మనకు విద్యుత్ సరఫరా చేస్తాయి. స్మార్ట్ మీటర్లు బిగిస్తాయి. బిల్లులు వసూలు చేసుకుంటాయి. ఇప్పటికే స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయని పలుచోట్ల వినియోగదారులు ఆందోళనలు చేస్తున్నారు.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విద్యుత్తు రంగంలో సంస్కరణలను ప్రవేశపెట్టిన ఫలితంగా దేశంలో ఇప్పటికే 56 శాతం విద్యుత్తు, 19 శాతం విద్యుత్తు పంపిణీ వ్యవస్థ, 55 శాతం పునరుత్పాదక విద్యుత్తు అదానీ లాంటి బడాకార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. విద్యుత్తు రంగాన్ని పూర్తిగా ప్రైవేటు శక్తులకు అప్పగించటానికి మోడీ ప్రభుత్వం 2003 నాటి ఎలక్ట్రిసిటీ చట్టాన్ని మార్చి విద్యుత్తు సవరణ బిల్లును ఆర్డినెన్స్ రూపంలో 2020లో సంపూర్ణ లాక్ డౌన్ సమయంలో తీసుకొచ్చింది. ఈ బిల్లు పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉన్నందున చట్టం రూపం తీసుకోలేదు. కానీ దొడ్డిదారిన అమలు చేస్తున్నారు. విద్యుత్ వినియోగదారుల గుండెలపై కుంపట్లు పెట్టే ఈ విద్యుత్తు బిల్లుపై ప్రతిపక్షాలతో పాటు వామపక్ష పార్టీలు, రైతు సంఘాలు, వినియోగదారుల సంఘాలు వివిధ రూపాలలో ఆందోళనలు కొనసాగిస్తున్నాయి.
ఈ సవరణ బిల్లును అడ్డం పెట్టుకొని దేశంలోని వినియోగదారులందరికీ స్మార్ట్ మీటర్లు మూడు సంవత్సరాల్లో బిగించాలని 2021 ఆగస్టు 17న కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. అయితే స్మార్ట్ మీటర్లను వినియోగదారులు అంగీకరిస్తేనే బిగించాలనే నిబంధనను అదానీ సంస్థ అధికారులు గాలికి వదిలేసి విద్యుత్ అధికారుల అండతో బిగించి వెళుతున్నారు. విద్యుత్ పంపిణీ ప్రైవేటీకరణ, ఉచిత విద్యుత్ పథకాల తొలగింపు, పేదలకు తక్కువ రేటుకి విద్యుత్ అందించే క్రాస్ సబ్సిడీ విధానం రద్దు, అందరికీ ఒకటే స్లాబ్, స్మార్ట్ మీటర్లు బిగించాలని కేంద్రం తాఖీదులు ఇచ్చింది. అందుకు ఆర్డిఎస్‌ఎస్ (రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం అమలులో భాగంగా ఆనాటి వైసీపీ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వ అండతో 18 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగింపుకు రంగం సిద్ధం చేశారు.ఒక్కొక్క మీటరు ఖర్చు, నిర్వహణ కలిపి రూ. 35 వేల రేటు నిర్ణయించారు. ఇదొక భారీ కుంభకోణం. అదానీకి, తమ బినామీ కంపెనీ షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థలకు రూ 13,252 కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పంపుసెట్లకు మీటర్లు బిగించటంపై రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో పంపు సెట్లకు మీటర్ల బిగింపు తాత్కాలికంగా ఆగింది.
ఇప్పటికే పెరిగిన విద్యుత్ బిల్లులతో సామాన్య జనం నిత్యం గగ్గోలు పెడుతున్నారు. కరెంటు చార్జీలు పెంచేది లేదని, బాదుడు ఆపుతామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని రోడ్లపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు బిల్లు కంటే కొసరు బిల్లు ఎక్కువై వినియోగదారులు లబోదిబో అంటున్నారు.