సంతకం ఫోర్జరీ చేసి అధ్యక్షుడు అయ్యాడు..
- హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు అరెస్ట్ క్లారిటీ ఇచ్చిన సీఐడీ
నకిలీ పత్రాలు సృష్టించి అధ్యక్ష పదవి పొందారని ఆరోపణలు
మాజీ మంత్రి కృష్ణయాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తింపు
అధ్యక్షుడితో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్న సీఐడీ
నిధుల దుర్వినియోగం జరిగిందని మరో ఫిర్యాదు నమోదు
By. V. Krishna kumar
Tpn: స్పెషల్ డెస్క్..
క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు.. ఆయన టీమ్ అరెస్ట్ పై సీఐడీ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రకటనలో విస్సుపోయే విషయాలు బయటపెట్టింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నకిలీ పత్రాలను ఉపయోగించి ఆయన అధ్యక్ష పదవిని పొందినట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నట్లు సీఐడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆయనతో పాటు మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
సీఐడీ వెల్లడించిన వివరాల ప్రకారం, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో జగన్మోహన్‌రావు నకిలీ పత్రాలు సృష్టించారు. ఈ క్లబ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కవిత, గౌలిపురా క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు, మాజీ మంత్రి సి. కృష్ణయాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆ పత్రాలను జగన్మోహన్‌రావుకు అందజేశారు. వాటిని ఆధారంగా చేసుకుని ఆయన హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత హెచ్‌సీఏలో నిధుల దుర్వినియోగం జరిగిందని టీసీఏ అధ్యక్షుడు గురువారెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ మోసంలో జగన్మోహన్‌రావుకు హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాసరావు, సీఈవో సునీల్ సహకరించినట్లు దర్యాప్తులో తేలిందని సీఐడీ పేర్కొంది. దీంతో జగన్మోహన్‌రావు, శ్రీనివాసరావు, సునీల్, రాజేందర్ యాదవ్‌తో పాటు ఫోర్జరీకి పాల్పడిన కవితను కూడా అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.