మహిళలంటే వైసీపీ నేతలకు ఎందుకంత ద్వేషం?
* ప్రసన్న కుమార్ రెడ్డిపై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఫిర్యాదు
* రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు సరికాదు : మంత్రి సవిత
* నల్లపురెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్
* మహిళా కమిషన్ చైర్ పర్సన్ కు తెలుగు మహిళల ఫిర్యాదు
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తనపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి నెల్లూరు ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక మాజీ ఎమ్మెల్యే ప్రసన్న తనను అసభ్య పదజాలంతో దూషించారని, ఇలాంటి సంస్కార రహిత ప్రసన్నను ప్రజా జీవితం నుంచి బహిష్కరించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. చెల్లెలు వరుసయ్యే తనపై ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భర్త చనిపోయిన తాను, అత్తవారింట్లో అందరి అనుమతితో ఎంపీ వేమిరెడ్డిని వివాహం చేసుకున్నానని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు.
మరోవైపు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని కించపరిచేలా అసభ్యకరంగా మాట్లాడిన వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తక్షణమే క్షమాపణలు చెప్పాలని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత డిమాండ్ చేశారు. ఎంతో రాజకీయ చరిత్ర కలిగిన ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబానికి చెందిన ప్రశాంతి రెడ్డిని ఆయన అసభ్యకరంగా మాట్లాడం చాలా బాధాకరం అన్నారు. చెల్లెలి సమానురాలైన ప్రశాంతి రెడ్డిని ఎలా విమర్శించాడని మంత్రి సవిత ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా మహిళలను కూటమి ప్రభుత్వం గౌరవిస్తుందని మంత్రి సవిత తెలిపారు. మహిళలను కన్నీరు పెట్టిస్తే రాజకీయంగానే కాకుండా నైతికంగా పతనమవ్వడం ఖాయమని ఆమె హెచ్చరించారు. మహిళలను ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
వైసీపీ నాయకులకు మహిళలంటే ఎందుకు అంత ద్వేషం అని ఆమె ప్రశ్నించారు. పార్టీ అధ్యక్షుడు జగన్ సహా వైసీపీ నాయకులు రాష్ట్రంలో మహిళలపై నోరు పారేసుకుంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తన సొంత తల్లిని, చెల్లిని ఆస్తుల కోసం ఇంటి నుంచి గెంటేయడమే కాకుండా కోర్టుకు ఈడ్చిన ఘనుడు అని మంత్రి సవిత అన్నారు. మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై వైసీపీ నాయకుడు ప్రసన్నకుమార్ రెడ్డి నోరు పారేసుకోవడం దారుణం అన్నారు. రాజకీయ విమర్శలు చేయకుండా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. జగన్ సతీమణి భారతీరెడ్డిపై పోస్టర్ వేశాడని ఐటీడీపీ కార్యకర్తను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని, ఆయనపై కేసు కూడా నమోదు చేసిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు.
ఇటు అమరావతిలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపీ తెలుగు మహిళలు ఖండించారు. ఈ మేరకు వారు మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజను కలిసి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే శిక్షించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.