ఓయూ క్యాంపస్ లో లోకల్ vs స్టూడెంట్స్.. నానా హంగామా
ఓయూ క్యాంపస్ లో మళ్లీ గొడవలు మొదలైనాయి.
చుట్టుపక్కల బస్తీ వాసులు బోనాల సందర్భంగా ఓయూ క్యాంపస్ లో పలుచోట్ల చెట్లకింద సేవిస్తున్న మద్యం, విందు భోజనం ఉద్రిక్తతకు దారితీసింది. టేబుళ్లు వేసుకొని మరీ బహిరంగంగా మద్యం తాగడంతో విద్యార్థులు అడ్డుకున్నారు. దీనితో టెన్షన్ వాతావరణం అలుముకుంది. బహిరంగంగా మద్యం సేవించడంపై అడిగినందుకు తమపై దాడి చేశారని ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద రోడ్డుపై బైఠాయించిన ఎన్ఎస్ యు ఐ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇది చదువుకునే క్యాంపసేనా అని ప్రశ్నించారు.
క్యాంపస్ లో మద్యం ఏరులై పారుతున్న కూడా పట్టించుకోని ఓయూ సెక్యూరిటీ, పోలీసులు వారి ముందే విద్యార్థి నాయకులపై దాడులు జరుగుతున్న చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుంటే క్యాంపస్ ఆవరణలో ఉన్న అమ్మవారికి ప్రతియేటా మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోందని కావాలని కొందరు విద్యార్థులు దాడికి పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే అమ్మవారి దేవాలయం ఉంటే బోనం సమర్పించాలని నడిరోడ్డుపై మద్యం తాగాలని ఎక్కడ ఉందంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. బోనం సమర్పించి ఇంటికి వెళ్లి తీరిగ్గా తాగితే తమకు అభ్యంతరం లేదన్నారు. కానీ క్యాంపస్ ఆవరణలో మద్యం తాగితే ఖచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.