ఎక్కాలు రావు..లెక్కలు తెలీవు..!
మూడోతరగతిలో ఆరోహణ,అవరోహణ క్రమం రాయలేరు
ఆరోతరగతిలోనూ సరిగ్గా 10 వరకూ ఎక్కాలు చెప్పలేరు
కేంద్ర విద్యాశాఖ సర్వేలో విస్తుపోయే వాస్తవాలు
దేశవ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థుల్లో లెక్కలు, ఎక్కాలు తెలియని విద్యార్థులే ఎక్కువని కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన తాజా సర్వే వెల్లడించింది. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే మూడో తరగి విద్యార్థుల్లో 45శాతం మందికి 99వరకూ అంకెలను ఆరోహణ, అవరోహణ క్రమంలో గుర్తించే శక్తి లేదు. ఆరోతరగతి విద్యార్థుల్లో 10 వరకూ ఎక్కాలు వచ్చిన వారు సగం కంటే కాస్త ఎక్కువ (53శాతమే).
గత ఏడాది డిసెంబర్ 4న కేంద్ర విద్యా శాఖ పరిధిలోని ..విద్యావ్యవస్థ పనితీరు, విశ్లేషణ, సమీక్ష- సమగ్రాభివృద్ధి రాష్ట్రీయ సర్వేక్షణ్ సర్వే నిర్వహించింది. దేశంలోని 36 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న 781 జిల్లాలకు చెందిన 74,229 ప్రభుత్వ, ప్రైవేట్ బడుల్లో నిర్వహించిన ఈ సర్వేలో 21,15,022 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
తొమ్మిదో తరగతిలో 53 శాతం మంది విద్యార్థులే గణిత ప్రక్రియల పరస్పర సంబంధం, వాటిని ఇచ్చిన లెక్కల్లో అన్వయించగలుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వ బడులకు చెందిన వారు అత్యుత్తమంగా ప్రతిభ చాటుతుండగా...రెండో స్థానాన్ని ప్రైవేట్ బడుల విద్యార్థులు ఆక్రమించారు. రాష్ట్ర ప్రభుత్వాలు నడిపే బడుల విద్యార్థులది మూడో స్థానం.
ఇక తెలుగు విషయానికొస్తే సరళమైన పదాలను కూడా మూడో తరగతి పిల్లలు చదవలేని దుస్థితి. ఎనిమిదవ తరగతి విద్యార్థులు రెండో తరగతి చిన్నారుల పాఠాలు చదవగలుగుతున్నారు. 9వ తరగతి చదివే విద్యార్థులకు సగం మందికే తమ మాతృభాషపై అవగాహన ఉంది. మాథ్స్, సైన్స్ 100కి 35 నుంచి 36 మంది విద్యార్థులకు మాత్రమే కాస్త పట్టుంది. సోషల్ సబ్జెక్టులో కూడా చాలా వెనకబడిపోయారు. జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్రం పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. అనంతపురం వంటి వెనుకబడిన జిల్లాలో గణితం, ఇంగ్లీష్, సైన్స్ లో విద్యార్థుల ప్రతిభ అధ్వాన్నంగా ఉందని సర్వే తేల్చింది.
పరాఖ్ రాష్ట్రీయ సర్వేక్షణ్ ఫలితాల నేపథ్యంలో విద్యార్థుల ప్రతిభను మెరుగుపర్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ వెల్లడించారు. అమ్మఒడి, తల్లికి వందనం వంటి పథకాలు తీసుకువచ్చి చదవడానికి కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు మెరుగ్గా చదవడానికి తీసుకోవలసిన మార్గాలను అన్వేషించాలి. ఈ తరహా అవగాహనతో పదో తరగతి పరీక్షల్లో మాత్రం అన్ని సబ్జెక్టుల్లో 100కు 100 మార్కులు సాధిస్తున్న చిన్నారులు లక్షల్లో ఉండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి..? పదిలో 600 మార్కులకు ఒకప్పుడు 500 దాటితే ఊరు, మండలమంతా మెచ్చుకుని, సన్మానాలు చేసే పరిస్థితి ఒకనాడు ఉండేది. కానీ, 570 పైన మార్కులొచ్చినా ఏడుస్తున్న చిన్నారులు, తగ్గాయని నసిగే తల్లిదండ్రులు ప్రస్తుతం అక్కడక్కడ కనబడుతున్నారు. తల్లిదండ్రుల దృక్పథం మారాలి. గురువులు ఆ దిశగా పిల్లలకు విషయ జ్ఞానాన్ని పెంచాలి. పిల్లలకు వారి సబ్జెక్టుల్లో ఎంత అవగాహన ఉంది, ఏ మాత్రం లెక్కల్లో పటిమ ఉందని ఆలోచించడం ఇకనైనా మొదలుపెట్టాలి.