61వేల విద్యాసంస్థలు - 2 కోట్లమందితో మెగా పీటీఎం 2.0
* పుట్టపర్తి మీటింగ్‌కు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్
* రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు జరిగేలా ఏర్పాట్లు
* 2 కోట్ల మందితో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్
* సరికొత్త రికార్డు దిశగా సమావేశం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మెగా పేరెంట్, టీచర్ మీటింగ్ కు సర్వం సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహించనున్న రెండో రెండో మెగా పేరెంట్, టీచర్ మీటింగ్ ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 2కోట్ల మందితో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు, టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉద్యోగులు, అధికారులు, దాతలు, పూర్వ విద్యార్థులు...ఇలా అందరినీ ఒకే చేర్చి సమావేశం నిర్వహించడం సరికొత్త రికార్డుగా మారబోతోంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనతో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గురువారం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో జరిగే సమావేశానికి సీఎం చంద్రబాబుతోపాటు మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారు. విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఉపాధ్యాయులతో సీఎం మాట్లాడనున్నారు.
61వేల విద్యాసంస్థలు- 2 కోట్లమంది భాగస్వాములు
గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, జూనియర్ కాలేజీలలో మెగా పేరెంట్, టీచర్ మీటంగ్ 2.0ను ఒక ఉత్సవంలా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మొత్తం 74,96,228 మంది విద్యార్థులు, 3,32,770 మంది ఉపాధ్యాయులు, 1,49,92,456 మంది తల్లిదండ్రులు, దాతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మొత్తంగా 2.28 కోట్ల మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ మెగా పేరెంట్ టీచర్ సమావేశం సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. ఏటా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య ఆత్మీయ సమావేశాన్ని పీటీఎం పేరుతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కార్పొరేట్ స్కూళ్లకు మాత్రమే పరిమితమైన ఈ పేరెంట్ టీచర్ మీటింగ్స్ ప్రభుత్వ పాఠశాలల్లోనూ నిర్వహించాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. మంత్రి సూచనలతో వరుసగా రెండో ఏడాది పండుగ వాతావరణంలో విద్యార్ధుల తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర భాగస్వాములతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమావేశాన్ని నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
తల్లిదండ్రులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేత
పిల్లలు చదువులో ఎంత పురోగతి సాధిస్తున్నారన్న విషయంతోపాటు.. వారి ప్రవర్తన ఎలా ఉంది, సామాజిక సమస్యలపై అవగాహన చేసుకుంటున్నారా లాంటి అనేక అంశాలపై తల్లిదండ్రులు నేరుగా తెలుసుకునే అవకాశం ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం ద్వారా కలగనుంది. విద్యార్థుల చదువులకు సంబందించిన సమగ్ర పురోగతిపై రిపోర్టు కార్డులను తల్లిదండ్రులకు ప్రభుత్వం అందించనుంది. తల్లిదండ్రులు వారి అభిప్రాయాలను, సూచనలను ఈ వేదిక ద్వారా ప్రభుత్వంతో పంచుకోవచ్చు. పాఠశాల విద్యలో పనితీరు, మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై చర్చించుకునే సదావకాశం ఈ కార్యక్రమం ద్వారా కలగనుంది.