క్రికెట్ టిక్కెట్స్ వివాదం.. అధ్యక్షుడితో సహా అందరూ అరెస్ట్
- విజిలెన్స్ నివేదిక ఆధారంగా రంగంలోకి దిగిన సీఐడీ..
టిక్కెట్ల కోసం బెదిరించినట్లు ఆధారాలు లభ్యం..
ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన విజిలెన్స్.. సీఐడీ..
By. V. Krishna kumar
Tpn: స్పెషల్ డెస్క్..
హెచ్‌సీఏ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( hca) అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు పాలక వర్గంలోని పలువురు సభ్యులను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా సీఐడీ ఈ చర్యలు చేపట్టింది. హెచ్‌సీఏ అధ్యక్షుడి హోదాలో జగన్మోహన్ రావు.. ఎస్ఆర్‌హెచ్ ఫ్రాంచైజ్‌ను బెదిరించినట్లు అభియోగాలు ఉన్నాయి. ఆ క్రమంలో 20 శాతం టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని ఎస్ఆర్‌హెచ్‌ను జగన్మోహన్ రావు డిమాండ్ చేసినట్లు ఈ విచారణలో సీఐడీ అధికారులు గుర్తించారు. గతంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా తమకు ఫ్రీగా టికెట్లు ఇవ్వాలంటూ ఎస్ఆర్‌హెచ్‌ను హెచ్‌సీఏ డిమాండ్ చేసింది. అలా చేయకుంటే.. మ్యాచ్ జరగబోనివ్వమంటూ ఎస్ఆర్‌హెచ్‌ను హెచ్‌సీఏ బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అందులోభాగంగా 10 శాతం టికెట్లు తమకు కేటాయించాలని ఎస్ఆర్‌హెచ్‌ను హెచ్‌సీఏ బెదిరించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐను ఎస్ఆర్‌హెచ్ ఆశ్రయించింది. ఐపీఎల్ మ్యాచ్‌లకు వేదిక మార్చాలంటూ బీసీసీఐను ఎస్ఆర్‌హెచ్ కోరింది. దీంతో ఈ వివాదం సంచలనమైంది. దీనిపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఉప్పల్ స్టేడియంలో మొత్తం 37 వేల మంది వీక్షకులు కూర్చునేందుకు సిట్టింగ్ కెపాసిటీ ఉంది. అందులో 10 శాతం టికెట్లు.. కాంప్లిమెంటరీ రూపంలో హెచ్‌సీఏకు ఇస్తుంది. అయితే అవి తమకు సరిపోవని.. మరో 10 శాతం టికెట్లను కేటాయించాలంటూ ఎస్ఆర్‌హెచ్‌ను హెచ్‌సీఏ యాజమాన్యం డిమాండ్ చేసింది. దీంతో ఈ అంశంలో తమను బెదిరిస్తున్నారని.. తమపై ఒత్తిడి తీసుకు వస్తున్నారంటూ ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం ఆరోపించింది. ఆ క్రమంలో ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్, లక్నో మ్యాచ్ సందర్భంగా పలు వీఐపీ బ్యాక్స్‌లకు హెచ్‌సీఏ యాజమాన్యం తాళాలు వేసి.. తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందంటూ ఎస్ఆర్‌హెచ్ ఆరోపించింది. ఈ అంశంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తడంతో.. విజిలెన్స్ విచారణకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా విజిలెన్స్ అధికారులు పలువురిని విచారించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులను సైతం విచారించారు. అందులో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ప్రమేయం ఉందనే విషయం బహిర్గతమైంది. ఈ నేపథ్యంలో ఆయనతోపాటు పలువురిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.