వినతులు, విజ్ఞప్తులతో ముగిసిన సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన
- ఎరువుల సరఫరా పెంపుపై కేంద్రానికి వినతి
- జహీరాబాద్ స్మార్ట్‌సిటీ, వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు సహకారం
- ఏరో-డిఫెన్స్ కారిడార్‌గా అభివృద్ధిపై చర్చలు
- నడ్డా, పియూష్ గోయల్ తో సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. అందరూ ఊహించినట్టు కాంగ్రెస్ పెద్దలతో సమావేశం అవుతారని ప్రచారం జరిగింది. అయితే ఈసారి కూడా రేవంత్ రెడ్డి పర్యటన కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితమైంది. రెండు రోజుల ఢిల్లీ టూర్ లో రేవంత్ రెడ్డి పలువురు కేంద్రమంత్రులతో సమావేశం అయ్యారు. ముందుగా కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి యూరియా కోటా పెంచాలని కోరారు. వానాకాలం సీజన్‌కు సంబంధించి ఏప్రిల్ - జూన్ మధ్య రాష్ట్రానికి 5లక్షల మెట్రిక్ టన్నులకు గాను కేవలం 3.07 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా చేశారని జేపీ నడ్డాకు రేవంత్ వివరించారు. ప్రాజెక్టుల్లో నీరు చేరడం, వ్యవసాయ పనులు మొదలైన కీలక సమయంలో యూరియా సరఫరా తగ్గిపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
అనంతరం ఢిల్లీలోని వాణిజ్య భవన్‌లో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. ఇందుకు అవసరమైన నీటి సరఫరా, విద్యుత్, ఇతర వసతుల కల్పనకు ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆదిభట్లలో అత్యున్నతమైన మౌలిక వసతులతో ప్రత్యేకమైన రక్షణ, ఏరోస్పేస్ పార్క్‌ను ఏర్పాటు చేసిందని వివరించారు. అంతేకాకుండా వరంగల్ ఎయిర్ పోర్టుకు సాయం, హైదరాబాద్-విజయవాడ మధ్య కొత్త పారిశ్రామిక కారిడార్, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ను ఏరో-డిఫెన్స్ కారిడార్‌గా అభివృద్ధి చేయడంపై పియూష్ గోయల్ తో రేవంత్ రెడ్డి చర్చించారు.
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ తో భేటీ
మొదటి రోజు పర్యటనలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు చేయడానికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సినిమా నిర్మాణంలో కీలకమైన యానిమేషన్, వీఎఫ్ఎక్స్ స్టూడియో, ఏఐ సహా ఆధునిక సదుపాయాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టూడియో నిర్మాణానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. తెలంగాణ రైజింగ్‌కు సంబంధించి మీడియా, సినిమా రంగాలకు ప్రచారకర్తగా ఉంటానని ప్రతిపాదించారు. అంతేకాకుండా ఇండస్ట్రీలో వివిధ విభాగాలకు అవసరమైన టెక్నీషియన్లను తయారు చేసేందుకు అనుగుణంగా స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు రేవంత్ కు అజయ్ దేవగన్ వివరించారు.
క్రీడల అభివృద్ధిపై కపిల్ దేవ్ తో చర్చలు
మరోవైపు లెజెండరీ క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయాలన్న ఆలోచన తనకు ఉందని రేవంత్ కు కపిల్ దేవ్ వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందని రేవంత్ తెలిపారు. ఇందుకోసం తనవంతు సహకారం అందిస్తారని కపిల్ దేవ్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం మీద రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అంతా అధికారిక కార్యక్రమాలతోనే ముగిసింది.