ప్రభుత్వాల అలసత్వం.. విద్యార్థులకు శాపం..!
* అధికారుల నిర్లక్ష్యానికి విద్యార్థులు బలి కావాలా?
* 2020–21లో వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ ఏర్పాటు
* నాలుగేళ్లయినా అనుమతులు తెచ్చుకోవడంలో అధికారుల నిర్లక్ష్యం?
* అనుమతులు తీసుకురావడానికి ఏళ్లు పడుతుందా?
* రాజకీయ విమర్శలు సరే.. విద్యార్థులకు న్యాయం ఏదీ?
రాష్ట్రంలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కాస్తా విద్యార్థులకు శాపంగా మారుతోంది. ప్రభుత్వాలు ఏమైనా అమలు చేయాల్సింది మాత్రం అధికారులే కదా. వైఎస్ జగన్ ప్రభుత్వం 2020–21లో కడపలో వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీని స్థాపించింది. ఈ యూనివర్సిటీకి ఏఐసీటీఈ (ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్), యూజీసీ (యునివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత కోవిడ్ కారణంగా అనుమతులు ఆలస్యమయ్యాయని వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో చెప్పారు. కానీ 2023, 2024 బ్యాచ్ లు ప్రారంభించే సమయంలోనైనా అధికారులు అనుమతులు తెచ్చుకోవడంలో చురగ్గా వ్యవహరించాల్సింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా అనుమతి పెండింగ్ లోనే ఉంది. అయితే ఈ విషయంపై అటు వైసీపీ అధినేత జగన్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్లతో కౌంటర్ ఇచ్చుకున్నారు. కానీ ఇక్కడ ఇద్దరు నేతలు అధికారుల నిర్లక్ష్యాన్ని మాత్రం ప్రస్తావించలేదు. యూనివర్సిటీకి ఇంకా అనుమతి రాలేదు. రేపు ఆ విద్యార్థులు తమ కోర్సు పూర్తి చేశాక అయినా అనుమతి రాకపోతే వారి పరిస్థితి ఏంటి? మరో ఫాతిమా మెడికల్ కాలేజీలా విద్యార్థులు, తల్లిదండ్రులు కోర్టుల చుట్టూ తిరగాలా?ఇప్పటికైనా కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (COA) నుంచి అనుమతి పొందేందుకు కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలి.
విద్యార్థులకు అండగా ఉంటాం: వైఎస్ జగన్
పులివెందుల పర్యటనలో ఉన్న జగన్ ను డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా వైసీపీ అండగా నిలుస్తుందని ఆపార్టీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (COA) అనుమతి లేకపోవడం, ADCET విడుదలపై గత కొద్ది రోజులుగా ఈ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. విద్యార్ధులకు మంచి యూనివర్సిటీ కడితే ఈ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేస్తోంది. వైఎస్సార్సీపీ విద్యార్ధులకు అన్ని విధాల అండగా ఉంటుంది అని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
అనంతరం వైఎస్ జగన్ తన 'ఎక్స్' ఖాతాలో ఈ విషయంపై సీఎం చంద్రబాబును నిలదీస్తూ ట్వీట్ చేశారు. మా ప్రభుత్వం 2020–21లో కడపలో వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీని స్థాపించింది. ఆ వర్సిటీకి ఏఐసీటీఈ (ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్), యూజీసీ (యునివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) అనుమతి ఇచ్చింది. కానీ.. కోవిడ్ మహమ్మారి ప్రబలడంతో ఆ సమయంలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (సీవోఏ) ఆ యూనివర్సిటీలో తనిఖీలు నిర్వహించలేకపోయింది. సీవోఏను ఒప్పించడంతో 2023 అక్టోబర్‌లో తనిఖీకి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మొదటి మూడు బ్యాచ్‌లకు ఆమోదం తెలిపేందుకు 2024 జూలై 1న తనిఖీ చేసింది. అయితే వైస్ ఛాన్సలర్ నుంచి ఎటువంటి హామీ లేకపోవడం వల్ల ఇప్పటికీ ఆమోదం పెండింగ్‌లో ఉంది. దురదృష్టవశాత్తు ప్రస్తుత ప్రభుత్వం ఆ యూనివర్సిటీని ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదు.
2023–24, 2024–25 బ్యాచ్‌లకు సీవోఏ అనుమతులు మా ప్రభుత్వ హయాంలోనే వచ్చాయి. కానీ.. ఈ సంవత్సరం గ్రాడ్యుయేట్ల బ్యాచ్ కోసం తక్షణమే ప్రభుత్వం స్పందిస్తుందని ఆశించాం. దారుణమైన విషయం ఏమిటంటే.. ఈ ప్రభుత్వం కొత్త విద్యార్థులను చేర్చుకోవడానికి ఇప్పటి వరకు ఏడీ సెట్ పరీక్ష నిర్వహించలేదు. ఏడీ సెట్‌కు ఇంకా కన్వీనర్‌ను కూడా నియమించలేదు. పరీక్ష ఎప్పుడు జరుగుతుంది? అడ్మిషన్లు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఈ ప్రభుత్వం నిద్రాణస్థితి నుంచి మేల్కొంటుందని ఆశిస్తున్నాను. మేలుకో బాబూ.. అంటూ జగన్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
పాపాలు చేసిన మీరు శాపాలు పెట్టడం ఏంటి: నారా లోకేష్
మరోవైపు డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు కలిసిన అనంతరం జగన్ తన ఎక్స్ ఖాతాలో చేసిన వ్యాఖ్యలకు.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా 'ఎక్స్' లోనే కౌంటర్ ఇచ్చారు. పాపాలు చేసిన మీరు శాపాలు పెట్టడం ఏంటి జగన్? అంటూ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను లోకేష్ తన ట్వీట్లో ప్రస్తావించారు. ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంది మీరే కదా జగన్ అని లోకేష్ ప్రశ్నించారు.
పాపాలు చేసిన మీరు నాకు శాపాలు పెట్టడం ఏంటి జగన్ గారు? ఇప్పుడు దొంగే దొంగా దొంగ అన్నట్టు, ఎందుకీ నాటకాలు? అన్నారు. 2020-21లో మొదటి బ్యాచ్ ప్రారంభం అయ్యింది. యూనివర్సిటీకి కనీసం సొంత బిల్డింగ్ లేకుండా, ఫుల్ టైం ఫ్యాకల్టీ కూడా లేకుండా 3 ఏళ్ళు నడిపించింది మీ ప్రభుత్వంలో కాదా? కనీసం ఫుల్ టైం ఫ్యాకల్టీ కూడా లేకుండా కన్సల్టెంట్లతో నడిపించి, విద్యార్ధుల జీవితాలతో ఆడుకున్నారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (COA) అనుమతి లేకుండా మీరు చేసిన నిర్వాకం వల్ల, 2020- 21, 2021-22 & 2022-23 బ్యాచ్ కి సంబంధించిన విద్యార్ధులు నష్టపోయారు. దీని ప్రభావం ఈ ఏడాది ADCET పై కూడా పడింది.
అనుమతి కోసం వచ్చిన కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (COA), యూనివర్సిటీని 01.07.2024 & 02.07.2024న సందర్శించి, కనీస సౌకర్యాలు కూడా లేవు అంటూ, యూనివర్సిటీలో లోపాలపై 26.07.2024న నోటీసులు ఇచ్చింది. దీనిపై 07.08.2024న ప్రభుత్వం వివరణ ఇచ్చింది. క్యాడర్ వైజ్ ఫ్యాకల్టీ లేదు అంటూ 2020- 21, 2021-22 & 2022-23 బ్యాచ్ అనుమతులు ఇచ్చేది లేదని 25.10.2024న COA తెలిపింది. 20.11.2024న యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో ప్రిన్సిపాల్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ లని తాత్కాలిక పధ్ధతిలో నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ ఉన్నత విద్యా శాఖ 02.07.2025న అనుమతిని మంజూరు చేసి, ఇదే విషయాన్ని 03.07.2025న COA కి తెలియ జేసింది.
మా ప్రభుత్వం తీసుకున్న చర్యలు
* కనీస సిబ్బంది లేకపోవడం వల్ల, APSCHEకి లేఖలు పంపి, ADCET 2025కి కన్వీనర్‌ను నియమించాల్సిందిగా కోరడం జరిగింది.
* యూనివర్సిటీ శాశ్వత భవనాల నిర్మాణం కోసం ఏర్పాట్లు చేస్తున్నాం.
* మీ హయాంలో ఇచ్చిన రెగ్యులర్ అధ్యాపక నియామక నోటిఫికేషన్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడంతో, విద్యార్ధులు నష్ట పోకుండా సిబ్బందిని నియమించటానికి చర్యలు తీసుకున్నాం
మీ హయాంలో కనీసం రెగ్యులర్ అధ్యాపకులు లేకుండా కన్సల్టెంట్లతో నడిపింది మీరు. యూనివర్సిటీకి కనీసమైన సౌకర్యాలు, భవనాలు కూడా లేకుండా నడిపింది మీరు. మీ పాపాలను సరి చేస్తూ, విద్యార్ధులకు అండగా నిలుస్తుంది కూటమి ప్రభుత్వం అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.