ఆంధ్రప్రదేశ్ ను 'అంతరిక్షం'లో అగ్రభాగాన నిలిపేలా స్పేస్ పాలసీ 4.0!
అంతరిక్ష (స్పేస్) పరిశోధన రంగంలో పెట్టుబడులు పెంచే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ‘ఏపీ స్పేస్ పాలసీ 4.0’ను రూపొందించింది. 2024-29 మధ్య పెట్టుబడులు పెట్టే సంస్థలకు పాలసీ నిబంధనలు వర్తిస్తాయని, రాబోయే పదేళ్లలో రూ.25 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 35 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అంతరిక్ష రంగంలో రూ.లక్ష కోట్లు పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా ఏపీ ముందడుగేసింది.
అంతరిక్ష పరిశోధన, సాంకేతిక అభివృద్ధి, తయారీ, లాంచ్ సేవల పరంగా రాష్ట్రాన్ని హబ్‌గా తీర్చిదిద్దాలన్నది లక్ష్యమని వివరించింది. లేపాక్షి, తిరుపతిల్లో స్పేస్ సిటీల అభివృద్ధికి ‘ఏపీ స్పేస్ సిటీ కార్పొరేషన్’ పేరిట స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్‌పీవీ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈలు, భారీ, మెగా పరిశ్రమలకు పలు ప్రోత్సాహకాలను అందించనుంది.
అంతరిక్ష రంగంలో స్టార్టప్‌లు, భారీ సంస్థలు, విద్యా సంస్థలు, ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించేలా సమ్మిళిత పారిశ్రామిక ఎకోసిస్టంను అభివృద్ధి చేయడం. స్పేస్ వ్యాల్యూ చైన్‌లో ఉన్నత, మధ్య, కింది స్థాయిల్లో దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం. గవర్నెన్స్, విద్యారంగం, వ్యవసాయం, విపత్తు నిర్వహణ, పర్యావరణ పర్యవేక్షణలో స్పేస్ ఆధారిత ఆవిష్కరణలను సులభతరం చేయడం.శ్రీహరికోట సమీపంలో పారిశ్రామిక బేస్ ఏర్పాటు. తయారీ క్లస్టర్‌లను అభివృద్ధి పరచడం వంటి భారీ లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు వెళుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్‌ల ఏర్పాటు కోసం ప్రభుత్వం 23వేల ఎకరాలు గుర్తించిందని పాలసీలో తెలిపింది. ఏపీఐఐసీ కోసం ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ, పార్కులను అభివృద్ది చేస్తున్నట్లు తెలిపింది. వీటిలో అప్రోచ్ రోడ్, విద్యుత్ కనెక్టివిటీ, నీటి కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. పార్కుల ఏర్పాటు, అభివృద్ది కోసం ప్రైవేట్, ప్రభుత్వ భూములను అనుమతిస్తున్నట్లు తెలిపింది.పెట్టుబడిదారులకు సత్వరం అనుమతులు ఇచ్చేలా సింగిల్ డెస్క్ అప్రువల్ మెకానిజాన్ని అమలు చేయనున్నట్లు పాలసీలో ప్రభుత్వం తెలిపింది.
రాబోయే పదేళ్లలో..శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షిలో స్పేస్ డిజైన్ సెంటర్‌ను నెలకొల్పి సబ్‌సిస్టం ఇంజినీరింగ్, సాఫ్ట్‌వేర్, పేలోడ్, డిజైన్ క్లస్టర్ అభివృద్ధి.
తిరుపతి జిల్లా శ్రీహరికోటలో స్పేస్ అప్లికేషన్ సేవలను అందుబాటులోకి తెచ్చేలా స్పేస్ డేటా బేస్డ్ సర్వీసెస్, భౌగోళిక విశ్లేషణల క్లస్టర్‌ల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. డిజైన్లు, పరిశోధన, తయారీ, లాంచింగ్ అవసరాలకు రెండు స్పేస్ ఇండస్ట్రియల్ జోన్‌ల అభివృద్ధి. స్టార్టప్‌లు, నవకల్పనలకు అనువైన వాతావరణం కల్పించడం. ఉపగ్రహ అప్లికేషన్లు, లాంచ్ లాజిస్టిక్స్ కోసం అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో క్రిటికల్ స్పేస్ టెక్నాలజీని అందిపుచ్చుకోనుంది.
లేపాక్షి, తిరుపతిలో స్పేస్ సిటీలు…
రాష్ట్రంలో రెండు స్పేస్ సిటీలు నిర్మించాలని కొత్త పాలసీలో సీఎం చంద్రబాబు నిర్దేశించారు. 500 ఎకరాల్లో ఏర్పాటు కానున్న లేపాక్షి స్పేస్ సిటీలో డిజైన్ అండ్ డెవలప్మెంట్‌కు ప్రాధానత్య ఇస్తారు. ఆర్ అండ్ డి, స్పేస్ స్టార్ట్ అప్, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, స్పేస్ అప్లికేషన్లు-సేవలకు సంబంధించి సంస్థలు ఏర్పాటు కానున్నాయి.
తిరుపతి స్పేస్ సిటీని మాన్యుఫ్యాక్చరింగ్, లాంచ్ లాజిస్టిక్ సేవలు అందించే సంస్థల ఏర్పాటుకు కేటాయించారు. ఇక్కడ లాంచ్ వెహికల్ అసెంబ్లీ, శాటిలైట్-పేలోడ్ అసెంబ్లీ, మెకానికల్ సిస్టమ్-కాంపొనెంట్ మాన్యుఫాక్చరింగ్, ఎలక్ట్రానిక్-ఏవియానిక్స్ అసెంబ్లీ సంస్థలకే ఈ సిటీలో అవకాశం కల్పిస్తారు. బెంగళూరుకు సమీపంలో లేపాక్షి స్పేస్ సిటీ, శ్రీహరికోట - చెన్నయ్‌కు సమీపంలో తిరుపతి స్పేస్ సిటీ ఉండటం కలిసొచ్చే అంశం. తిరుపతి స్పేస్ సిటీ నుంచి – శ్రీహరికోటకు రోడ్ కనెక్టవిటీపైనా ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు.
రాష్ట్రంలో మొత్తం 6 క్లస్టర్లను ఇందుకోసం ప్రతిపాదించారు. వీటిలో విశాఖపట్నంలో నావెల్ క్లస్టర్, దొనకొండలో ఏరోక్రాఫ్ట్స్ కాంపొనెంట్ క్లస్టర్, తిరుపతిలో ఆర్ అండ్ డి క్లస్టర్, లేపాక్షిలో ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్ క్లస్టర్, ఓర్వకల్లులో అన్‌మాన్డ్ సిస్టమ్ క్లస్టర్, జగయ్యపేటలో మిస్సైల్ అండ్ అమునిషన్ క్లస్టర్‌లను ఏర్పాటు చేయనున్నారు.
2033 నాటికి 44 బిలియన్ డాలర్ల పెట్టుబడులే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘ఇండియా స్పేస్ పాలసీ-2023’ని తీసుకొచ్చింది. ఏపీ ప్రభుత్వం సైతం అందులో భాగస్వామ్యమై లక్ష మందికి రానున్న ఐదేళ్లలోనే అంతరిక్షం పాలసీ ద్వారా ఉద్యోగాలు సృష్టించాలనుకుంటోంది.