AP Government: ఎన్నాళ్లీ హనీమూన్ .. ఎవడబ్బ సొమ్మనీ..!
ఉమ్మడి రాజధాని గడువు ముగిసినా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉద్యోగులకు వసతి
11 ఏళ్లుగా సాగుతున్న ప్రజాధనంతోనే అద్దెల చెల్లింపు
ఇంకా హైదరాబాద్ వదిలి రావడానికి ఇష్టపడని ఉద్యోగులు
ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయి పదేళ్లు దాటిపోయింది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని చెప్పిన టైమ్ కూడా దాటిపోయింది. చట్టపరమైన నోటిఫికేషన్ కూడా 2024లోనే ఎక్స్ పైర్ అయిపోయింది. కాని హైదరాబాద్ నుంచి ఏపీకి తరలి రావాల్సిన ఎంప్లాయిస్ కి మాత్రం ఇంకా విడిదిల్లు సౌకర్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. విభజన సమయంలో ముందే రాజధానికి తరలాలనే కాన్సెప్టును చంద్రబాబు పెట్టుకున్నారు. లేదంటే అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడం కష్టమని ఫీలయ్యారు. దానికి ప్రత్యర్ధులు వేరే అర్ధాలు చెప్పారు.. అది వేరే సంగతి. కాని దాని కోసం 8200 మంది ఎంప్లాయిస్ ను తరలి రమ్మన్నారు. అందులో చాలామందికి హైదరాబాద్ లోనే సొంత నివాసాలు ఉన్నాయి. పిల్లల చదువులు కూడా అక్కడే నడుస్తున్నాయి. కాబట్టి మొత్తానికే ఇప్పటికిప్పుడు తరలి రమ్మంటే కష్టమని.. వారికి ఐదు రోజుల పనిదినాలు పెట్టి శనివారం, ఆదివారం సెలవు ఇచ్చారు. మనోళ్లు శుక్రవారం మధ్యాహ్నమే సర్దేసుకుని.. మళ్లీ సోమవారం మధ్యాహ్నానికి పనిలోకి దిగలేరు. ఇక వీరందరికి 24శాతం హెచ్ఆర్ఏ ప్రత్యేకంగా ఇచ్చారు. ఇవి గాక వీరి కోసం రెయిన్ ట్రీ పార్క్ లాంటి వాటిలో హాస్టల్ సౌకర్యంలా పెట్టి.. వాటికి అద్దె చెల్లిస్తున్నారు. అమరావతి ఎక్స్ ప్రెస్ అని ఒకటి ప్రత్యేకంగా వేసి.. దాంట్లో ఛార్జీలు కూడా తక్కువ పెట్టి సబ్సిడీ మీద ఇస్తున్నారు.
ఇది 2014లోనే మొదలై.. నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఈ అద్దెల్లో కూడా అక్రమాలు నడుస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి.. పది మందికి వంద మంది ఉంటున్నట్లు రికార్డులు చూపించి.. అద్దె ప్రభుత్వం నుంచి ఆ బిల్డింగుల ఓనర్స్ అదనంగా తీసుకుంటున్నారని.. లెక్క పక్కా లేకుండా పోయిందని కూడా ఆరోపణలు గట్టిగా ఉన్నాయి. ఇక ఇన్నేళ్లు అంటే పదేళ్లు దాటిపోయి 11వ ఏడాది కూడా కంప్లీట్ అయిపోయినా... ఇంకా ఎందుకిస్తున్నారు?
ఇది చదవండి: పేకాట శిబిరాలకు హోల్ అండ్ సోల్ ప్రొప్రయిటర్ ఆ ఎమ్మెల్యేనా..?
వాళ్లు హైదరాబాద్ వదిలేసి రారా..? రాలేరా? రాలేనప్పుడు వారు రాజీనామాలు చేసేస్తే.. ఉద్యోగాలు నిరుద్యోగులకైనా ఇవ్వొచ్చు కదా. అది వదిలేసి ఇంకా వారిని ఎందుకు సవరదీస్తున్నట్లు? పోస్టింగ్ ఎక్కడైతే అక్కడికి వెళ్లాల్సిందే కదా.. బదిలీలు అయితే అలాగే షిఫ్ట్ అయి వెళతారు కదా.. ఇది కూడా అంతేనని చెప్పలేరా? లేటెస్టుగా మరో ఏడాది పొడిగించినట్లు జీవో కూడా రిలీజ్ చేశారు. అంటే 12 ఏళ్లు .. అంటే పుష్కరం పూర్తి చేస్తారు. అప్పుడు కూడా చేస్తారో లేదో తెలియదు.
చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొదట్లో ఆకస్మిక పర్యటనలు, జన్మభూమి అంటూ ఎంప్లాయిస్ పై తీవ్ర వత్తిడి తెచ్చారు. పైగా చంద్రబాబు రివ్యూలు, సమావేశాలు భరించడం కష్టమని అప్పట్లో అధికారులు ఆవేదనగా చెప్పేవారు. ఈ దెబ్బకే ఆయన మీద ప్రభుత్వ ఉద్యోగులు కూడా వ్యతిరేకమయ్యారని.. 2019లో వైసీపీ కోసం పని చేశారన్నారు. కాని జగన్ దెబ్బ మరో రకంగా పడింది. ఆయన సమావేశాలు పెట్టరు.. అసలు ఎవరి మాట వినరు.. చెప్పింది చేయమని ఫుల్లు ప్రెజర్ పెట్టి .. అంతకంటే ఎక్కువగా వేధించారు. దీంతో మళ్లీ ఎబౌట్ టర్న్ అంటూ టీడీపీ వైపు తిరిగారు.
2014లోనే మారినట్లుగా కనపడ్డ చంద్రబాబునాయుడు ఈసారి మరింత మారినట్లుగా కనపడటానికి ప్రయత్నిస్తున్నారు. అందుకేనేమో ఈ ఉద్యోగులతో పెట్టుకుంటే మళ్లీ అధికారానికి రావడం కష్టమనుకుంటున్నారు.. అందుకే వాళ్లకు మళ్లీ జీవో ఇచ్చి మరో ఏడాది పొడిగించారు. ఒకవైపు ఆర్ధిక పరిస్ధితి బాగోలేదు.. సంక్షేమ కార్యక్రమాలు అమలు చాలా కష్టం ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు ఇలాంటి చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికైనా ఈ హానీమూన్ ముగించి.. వారిని రీలొకేట్ కావాల్సిందే అని చెప్పాలి.. అనవసరమైన అద్దెల చెల్లింపు నిలిపివేయాలని ఉద్యోగుల్లోనే కొందరు డిమాండ్ చేస్తున్నారు.