డ్రగ్స్ దందాలో నయా ట్రెండ్.. ఇంపోర్టు టు ఎక్స్ పోర్ట్..
- దిగుమతి స్థాయి నుండి ఎగుమతి స్థాయికి మారిన డ్రగ్స్ దందా..
సిటీ శివారు ప్రాంతాల్లో వ్యాపారం సాగుతున్నట్లు అనుమానం
పారిశ్రామిక వాడల్లో తయారీ కేంద్రంగా మారుతున్న మూతబడిన ఫ్యాక్టరీలు..
ప్రత్యేక నిఘా అవసరం అంటున్న జనాలు.. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతున్న అధికారులు....
By. V. Krishna kumar
TPN: స్పెషల్ డెస్క్..
మత్తు ఇప్పుడు ఇదే ట్రెండ్... ఎక్కడ చూసిన దీని జాడే.. ఏ సందులోకి వెళ్లిన దీని వాసనే గుప్పుమంటోంది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(narcotic control bureau)..హెచ్ న్యూ... ఎక్సైజ్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, టాస్క్ ఫోర్స్, ఎస్ఒటి ఇంత మంది నిఘా పెట్టిన వ్యాపారం మాత్రం అంతులేకుండా సాగుతూనే ఉంది. ఒకప్పుడు ఏజెన్సీ ప్రాంతాల నుండి గంజాయి రవాణా, గోవా ఇతర రాష్ట్రాలు, దేశాల నుండి డ్రగ్స్ హైదరాబాద్ కి చేరి వ్యాపారం మొదలైంది. చాపకింద నీరులా విస్తరించిన ఈ దందాను అరికట్టేందుకు గత ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనే చట్టాలు, నిర్ణయాలు తీసుకుని నిత్యం దాడులు చేస్తున్న ఎక్కడో ఒక దగ్గర చేతులు మారుతూనే ఉంది. ఒకప్పుడు విదేశాల నుండి డ్రగ్స్ దిగుమతి చేకునే వ్యాపారులు, ఇప్పుడు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నారంటే నమ్ముతారా.. ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఇటీవల కాలంలో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ (excise enforcement) అధికారులు చేసిన దాడుల్లో అనేక విషయాలు బయటపడ్డాయి. దాడుల్లో దడపుట్టించే విషయాలు తెలిసిన అధికారులు అప్రమత్తం అయ్యే పరిస్థితి కూడా ఏర్పాడింది.
సిటీ శివారు ప్రాంతంలో ఈ డ్రగ్స్ దందాలో అడుగుపెట్టిన వ్యాపారులు అక్రమ మార్గంలో మన దగ్గరే మత్తుపదార్థాలు తయారు చేసిన ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారన్న విషయాలు వెలుగు చూశాయి. శివారు ప్రాంతాలైన ఉప్పల్ ఇండస్ట్రియాల్ ఏరియా, పాశమైలారం, కాటేదాన్, జీడిమెట్ల ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పారిశ్రామిక వాడల్లో మూత పడిన ఫ్యాక్టరీలే వీరికి అడ్డగా మారినట్లు గుర్తించారు. ఏళ్ల తరబడి మూతబడిన ప్యాక్టరీలపై ఎవరూ అంతగా పట్టించుకోరు.. ఇదే వారి వ్యాపారానికి అనువుగా మారింది. ఆయా ఫ్యాక్టరీలను అద్దెకు తీసుకొని అందులో అల్ఫా జోలం వంటి ఇతర మాదకద్రవ్యాలు తయారు చేసి రవాణా చేస్తున్నట్లు తెలుసుకున్నారు. అడపాదడపా దాడులు చేస్తున్న వారి వద్ద పట్టుబడేది స్వల్పంగా మాత్రమే. మూతబడిన ఫ్యాక్టరీలలో కోట్ల రూపాయల విలువ చేసే వ్యాపారం సాగుతున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం అందింది. అందుకే ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసి మరీ నిఘా పెంచారు.
గతంలో కేవలం సంపన్న వర్గాలు, సినీ ఇండస్ట్రీకి చెందిన వారు డ్రగ్స్ తో పట్టుబడినట్లు రికార్డులు ఉన్నాయి. రాను రాను ఈ వ్యాపారం సిటీలో ఊపందుకుంది. ఐటీ, సాఫ్ట్ వేర్ రంగాలు, వీకెండ్ కల్చర్ రావడంతో డ్రగ్స్ దందాకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. ఇక పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ దీనికి బానిస కావడంతో వేలల్లో డ్రగ్స్ కొనుగోలు చేయలేని వారు గంజాయికి అలవాటు పడినట్లు సర్వేలో తేలింది. చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు అందరూ దీనికి బానిసైన వారే. అందుకే పాన్ షాపుల నుండి మొదలుకొని బడా దుకాణాల్లో కూడా గంజాయి విచ్చలవడిగా దొరుకుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు గంజాయికి ధూల్ పేట ప్రాంతం డెన్ గా ఉండేది. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఈజీగా దొరుకుతోంది. గంజాయి. దాని నుండి తయారు చేసిన ఓ.జీ కుష్ ఆయిల్ ఇలా రకరకాల పద్దతుల్లో కొందరు వ్యాపారాలు చేస్తున్నారు.
మొదట్లో దీనికి బానిసైన వారంతా తరువాత వ్యాపారులుగా మారుతున్నట్లు అధికారుల విచారణలో తేలింది. మాదకద్రవ్యాల కోసం డబ్బులు లేక పోవడంతో తమ వద్ద ఉన్న కొంత మొత్తాన్ని విక్రయం చేసి, మరికొంత తాము వాడుతున్నట్లు గుర్తించారు. అలా ఎక్సైజ్, తెలంగాణ నార్కోటిక్ బ్యూరో, హెచ్ న్యూ అధికారులు, సిబ్బంది చేసిన దాడుల్లో అనేక విషయాలు బయటపడ్డాయి. చాల మంది విద్యార్థులు, సాఫ్ట్ వేర్ యువకులు ఇలా వ్యాపారులుగా మారి తమ జీవితాలు జైలుకి అంకితం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టిన పోలీస్ అధికారులు కేవలం దాడులే కాకుండా సిటీ శివారు ప్రాంతాల్లో మూతబడిన ఫ్యాక్టరీలపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. మాదకద్రవ్యాలను అరికట్టాలంటే చోట వ్యాపారులతో పాటు సప్లయ్ స్థాయికి ఎదిగిన డాన్ లను కట్టడి చేస్తే కొొంత వరకు తగ్గే అవకాశం ఉందని జనం అభిప్రాయపడుతున్నారు.