సీఎం రేవంత్ ఢిల్లీ టూర్.. ఈసారి అందుకేనా?

By TVK
On
సీఎం రేవంత్ ఢిల్లీ టూర్.. ఈసారి అందుకేనా?

* రెండు రోజులపాటు ఢిల్లీలో రేవంత్
* పార్టీ వ్యూహాలపై హైకమాండ్‌తో కీలక చర్చలు
* రాష్ట్రాభివృద్ధి ప్రణాళికలకు కేంద్ర మద్దతు కోరే యోచన

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. నేడు ఢిల్లీ వెళ్తున్న సీఎం రేవంత్ మరో రెండు రోజులపాటు అక్కడే మకాం వేస్తున్నారు. ఇది అధికారిక పర్యటనే కాకుండా పార్టీ వ్యవహారాలపైనా రేవంత్ క్లారిటీ తెచ్చుకునేందుకు ఈ టూర్ ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ డీపీఆర్, రీజనల్ రింగ్ రోడ్ లకు గ్రీన్ సిగ్నల్ పొందేందుకు సంబంధిత మంత్రులను కలిసే అవకాశం ఉంది. గత పర్యటనలో ఈ విషయాలపై చర్చించినా.. ఎలాంటి పురోగతి లేదు. అంతేకాకుండా ప్రస్తుతం రైతులు విత్తనాలు వేసిన నేపథ్యంలో యూరియా, ఎరువుల కొరతను తీర్చేందుకు చర్యలు చేపట్టాలని కోరనున్నారు. 

మరోవైపు పార్టీ పరంగా కీలకమైన అంశాలపై రేవంత్ అధిష్టానం నుంచి క్లారిటీ తీసుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణలో పర్యటించిన రెండు మూడు రోజుల్లోనే సీఎం ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఈసారి ప్రాధాన్యత పెరిగింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు, నామినేటెడ్ పోస్టుల భర్తీపైనా అధిష్ఠానంతో సీఎం రేవంత్ చర్చిస్తారని తెలుస్తోంది. సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చిస్తారని సమాచారం. 

అంతేకాకుండా కొత్త రేషన్ కార్డుల మంజూరు సందర్భంగా జూలై 14న తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నిర్వహించనున్న బహిరంగ సభకు రాహుల్, ప్రియాంక గాంధీలను ఆహ్వానిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల పార్టీలో పెరిగిన వర్గ విభేదాల నేపథ్యంలో పార్టీ బలోపేతంపై అధిష్టానం నుంచి సూచనలు తీసుకునే ఛాన్స్ ఉంది. మొత్తం మీద రేవంత్ ఢిల్లీ టూర్ మాత్రం ఈసారి ఆసక్తి రేపుతోంది

Advertisement

Latest News