హైదరాబాద్ లో కొత్త కల్చర్.. పెళ్లి కాకుండానే అన్నీ.. ఏమిటీ కో-లివింగ్..?
హైదరాబాద్ లో పెరిగిపోతున్న విదేశీ సంస్కృతి
విచ్చలవిడిగా వెలుస్తున్న కో లివింగ్ రూమ్స్
ప్రైవసీ పేరుతో తప్పటడుగులు
By. V. Krishna kumar
TPN, స్పెషల్ డెస్క్
ఐటి.. సాఫ్ట్ వేర్ రంగం హైదరాబాద్ (Hyderabad) విస్తృతంగా పెరిగిన నేపధ్యంలో యువకులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగానే అందాయని చెప్పొచ్చు. చదువుకు తగ్గ ఉద్యోగాలు, జీతభత్యాలు అందడం అంతవరకు బాగానే ఉన్నా.. కొన్ని పరిస్థితులు వారిని తప్పటడుగులు వేసేలా చేస్తున్నాయి. విదేశీ వ్యామోహాలు విపరీతంగా పెరగడంతో ఎప్పుడు లేనంతగా పబ్ కల్చర్ పుట్టుకొచ్చింది.. వర్క్ స్ట్రెస్ నుండి రిలాక్స్ అంటూ వీకెండ్ కల్చర్ పుట్టుకొచ్చింది. అందులో భాగంగానే పబ్స్, వీకెండ్ పార్టీలు పెరిగి మాదకద్రవ్యాల వినియోగం పెరిగి పోయిందనే చెప్పాలి. తాజాగా వీకెండ్ కల్చర్ తో పాటు కో లీవింగ్ (Modern Pay Accommodations) సిటీలో కూడా మొదలయ్యింది. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఒకే ఇంట్లో ఉండటమే కో లివింగ్. హాస్టల్ ఫీజ్ లు ఎక్కువగా ఉండటం. ప్రత్యేకంగా ఇల్లు అద్దెకు తీసుకుంటే రెంట్ అధికంగా ఉండటంతో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి వుంటే కాస్త ఆర్ధిక భారం తగ్గుతుందని ఆలోచన. కానీ ఇప్పుడు ఈ ఆలోచన తప్పటడుగు వేసేలా తయారైందని ఆరోపణలు ఉన్నాయి.
సాధారణంగా ఈ కో లివింగ్ విదేశాల్లో ఎక్కువగా వినిపిస్తుంది. మన పిల్లలు ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం వెళ్తే అక్కడ అందరూ కలిసి ఉంటే కాస్త ఖర్చు తక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయని తల్లిదండ్రులు భావిస్తారు. అయితే ఇదే కల్చర్ ఇప్పుడు సిటీకి పాకింది. ఐటి హబ్ గా మారిన హైటెక్ సిటి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్టీక్ ఇలా ఎక్కడబడితే అక్కడ ఈ తరహా లివింగ్ గదులు అద్దెకు దొరుకుతున్నాయి. వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుండి చదువు, ఉద్యోగం కోసం వచ్చే యువతి యువకులు ఎక్కువగా ఈ ప్రాంతాల్లోనే అద్దెకు ఉంటున్నారు. బ్యాచిలర్స్ అంటే ఎవరు ఇల్లు అద్దెకు ఇవ్వకపోవడం ఈ కో లీవింగ్స్ సంస్కృతి మన హైదరాబాద్ సిటీలో ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. అద్దెలు వేలల్లో రావడం, అదికూడా నెల చివరి రోజుల్లోనే వచ్చే సరికి ఇంకేముంది చాలా మంది దీన్ని వ్యాపారంగా మార్చుకున్నారు. పెద్ద పెద్ద భవనాలు నిర్మాణాలు చేసి కుటుంబాలకన్న ఇలా అద్దెకు ఇస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. ఫ్రీ వైఫై.. హోమ్ లీ ఫుడ్ అంటారు. అంతేకాదు లాడ్జ్ లకన్నా అధ్వాన్నంగా మారి గంటకు రెంట్ లేదా వారానికోసారి, నెలకోసారి అద్దెల ఫెసిలిటి ఇస్తున్నారు. అందుకే మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ లలో హైటెక్ సిటీ ఇలా ఎక్కడ చూసినా ఇవే కనపడుతున్నాయి. పుట్టగొడుల్లా వెలుస్తున్న వీటికి అడ్డుఅదుపు లేకుండా పోయిందని, వీటివల్ల యువతి, యువకులు తప్పటడుగులు వేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్ ఆందోళన వ్యక్తం చేశారు. వీటిపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.
కో లివింగ్స్ రూమ్స్ అంటే ప్రైవసీ, హైజిన్, ఫెసిలిటీ పరంగా చాలా అద్భుతంగా ఉంటాయని భావిస్తున్నారు. ఇక ఇలా అందరూ కలిసి ఉండటం ఎంతవరకు శ్రేయస్కరం అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే విదేశీ సంస్కృతి హబ్స్, వీకెండ్ పార్టీలు, రేవ్ పార్టీలు విచ్చలవిడిగా పెరిగిపోయి యువత పెడదారిన పడుతోందని, ఇలాంటి కో లీవింగ్స్ వల్ల జరిగే చెడు చెప్పాల్సిన పని లేదన్నారు. కో లివింగ్స్ వ్యవహారం కూడా విదేశీ అని దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వాస్తవానికి లేడీస్, జెంట్స్ హాస్టల్స్ విడివిడిగా ఉంటాయి. వీటిపై పోలీసుల నిఘా నిరంతరం ఉంటుంది. సిసి కెమెరాల పర్యవేక్షణ, హాస్టల్ సెక్యూరిటీ ఇలా కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. కానీ ఈ తరహా కో లివింగ్స్ పేరుతో ఇచ్చే అద్దె గదుల్లో ఎలాంటి భద్రత ఉండదు. అందుకే యువతి యువకులు ప్రైవసీ ఎక్కువగా ఉంటుందని వీటిపై మక్కువ చూపుతున్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి పెళ్లికాకుండానే సహజీవనం చేసేందుకు ఇవి ఫ్లాట్ ఫారాలుగా మారాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి కల్చర్ వల్ల వారు పాడయ్యే ప్రమాదం ఉంది కాబట్టి వీటిపై చర్యలు తీసుకోవాలని, కట్టడి చేయాలని కోరుతున్నారు. మరి దీనిపై సీఎం, పోలీస్ శాఖ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో.