అహ్మదాబాద్ లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం..
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. ప్రమాద స్థలం నుంచి ఆకాశంలో నల్లటి పొగ పైకి లేచింది. రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుంది. విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన వెంటనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ప్రమాద సమయంలో విమానంలో దాదాపు 242 మంది ఉన్నట్లు తెలుస్తోంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఎయిర్ పోర్ట్ సమీపంలో ఉన్న మేఘానీ నగర్ షాహిబాగ్ వద్ద విమానం కుప్పకూలింది. అయితే ఇప్పటివరకు ఎంతమంది మరణించారనే విషయం వెల్లడించలేదు. సమాచారం అందిన వెంటనే రాష్ట్ర విపత్తు నిర్వహణ-అగ్నిమాపక సిబ్బంది, జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. విమాన శకలాలు జనావాసాల మీద పడటం వల్ల మరణాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అగ్నిమాపక వాహనాలు, అంబులెన్సులు, పోలీసు వాహనాల సైరన్ మోతలతో ఆ ప్రాంతం అంతా మార్మోగిపోయింది. సమాయక చర్యలు అందజేయడానికి సంఘటన స్థలానికి స్థానికులు పరుగులు తీశారు. అందుబాటులో ఉన్న వాహనాలను క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడానికి వినియోగించారు. ఘటనపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ ఈటెల రాజేందర్ తో పాటు పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.