పాశమైలారం మృతులకు కోటి రూపాయల నష్ట పరిహారం.. సీఎం

On
పాశమైలారం మృతులకు కోటి రూపాయల నష్ట పరిహారం.. సీఎం

హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో గానీ తెలంగాణ రాష్ట్రంలో గానీ ఇంత భారీ ప్రమాదం జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఈరోజు (మంగళవారం) పాశమైలారం చేరుకున్న సీఎం.. ప్రమాదస్థలిని పరిశీలించి, ఈ ఘటనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పాశమైలారం ఘటన అనంతరం మంత్రులు, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. మృతుల్ని తరలించడం, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడం వంటివి అధికారులు దగ్గరుండి మరీ చూసుకుంటున్నారన్నారు. ఈ ప్రమాదం చాలా మంది ప్రాణాలు బలిగొందని.. ప్రమాదం దురదృష్టకరమని ఆవేదన చెందారు. దుర్ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించామని.. ప్రభుత్వ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. ప్రమాదంలో మృతులు.. క్షతగాత్రులు బీహార్, ఒడిశా, మధ్య ప్రదేశ్, ఆంధ్ర, తెలంగాణకు చెందిన వారు ఉన్నారన్నారు. ఈ ప్రమాదంలో 36 మంది ప్రాణాలు కోల్పోగా.. 17 మంది మిస్ అయ్యారని తెలిపారు. ఇంకా మరికొంతమంది ఆచూకీ లభించడం లేదన్నారు. ప్రమాద సమయంలో 143 మంది కార్మికులు ఉన్నారని.. ప్రమాదం అనంతరం 53 మంది ఆచూకీ తెలిసిందని సీఎం పేర్కొన్నారు. ఇంకా కొంతమంది శిథిలాల కింద ఉన్నారా.. లేక భయంతో ఎక్కడికైనా వెళ్ళిపోయారా అన్నది తెలియాల్సి ఉందని వెల్లడించారు.

సిగాచి పరిశ్రమలో జరిగిన ఈ ప్రమాదాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన మృతులకు కోటి రూపాయల పరిహారం అందిస్తామని ప్రకటించారు. తీవ్ర గాయాలపాలైన వారికి, పని చేసుకోలేని స్థితిలో ఉన్న వారికి పది లక్షలు ఇస్తామన్నారు. స్వల్ప గాయాలు అయినవారికి ఐదు లక్షల రూపాయలు పరిహారం అందజేస్తామని తెలిపారు. క్షతగాత్రులకు వైద్య సహాయం ప్రభుత్వం, పరిశ్రమ వర్గాలు కలిసి అందిస్తామని చెప్పారు. ప్రమాదంపై ఒక కమిటీని వేసామని.. కమిటీ బాధ్యులను గుర్తించిన అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని సీఎం అన్నారు. పరిశ్రమలకు సూచనలు ఇచ్చే విధంగా, ఆ సూచనలను పరిశ్రమలు అమలు చేసే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఫార్మా యజమానులు కార్మికుల భద్రతపై చర్యలు తీసుకోవాలని... అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధితుల పిల్ల చదువుల బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుందని.. మృతదేహాలను సొంత గ్రామాలు తరలించేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కంపెనీపై కేసు నమోదు..

పాశమైలారం (Pashamylaram) ఘటనపై తొలి కేసు నమోదైంది (Case Filed). సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువులోని పాశమైలారం పారిశ్రామిక వాడలో సిగాచీ పరిశ్రమలో సోమవారం భారీ పేలుడు(Sigachi Explosion) సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 39 మంది మృతి చెందగా, మరో 30 మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉందని సహాయక బృందాలు పేర్కొన్నాయి. కాగా ఈ ఘటనపై బీడీఎల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓ బాధిత కుటుంబానికి చెందిన యశ్వంత్ ఫిర్యాదు చేయడంతో సిగాచీ కంపెనీ యాజమాన్యంపై 105, 110, 117 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Latest News