డయల్ 112.. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి చాలు
- ప్రమాదం ఏదైనా క్షణాల్లో వస్తున్న అధికారులు..
బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా పని చేస్తున్న డయల్ 112..
కాల్ చేసిన వెంటనే క్షణాల్లో స్పాట్ కి వస్తున్న ఆయా శాఖల సిబ్బంది..
రెండు రోజుల్లో మూడు భారీ ప్రమాదాల నుండి రక్షణ..
పలు శాఖల నెంబర్లను అనుసంధానం చేసిన తెలంగాణ పోలీసులు..
By. V. Krishna kumar
pn: స్పెషల్ డెస్క్..
మనకు అనుకోని ప్రమాదం ఎదురైతే ఎమ్ చేస్తాము.. రోడ్డు ప్రమాదం అయితే డయల్ 100కి, క్షతగాత్రులు ఉంటే 108, అగ్నిప్రమాదం అయితే 101 ఇలా వాటికి కాల్ చేస్తాము. ఒక్కోసారి హడావిడిలో ఎవరికి కాల్ చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ ప్లేస్ ఏంటో తెలియదు.. అక్కడ ఎవరు సహాయానికి రారు.. ఎవరిని అడగాలో అర్ధం కాదు.. మనం ఉన్న ప్రాంతానికి చెందిన పోలీస్ స్టేషన్ ఏదో తెలియక తికమక అవుతుంది. నా నా అవస్థలు పడి అసలు విషయం తెలుసుకునే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఆ తరువాత బాధపడటం మనకు మిగులుతుంది.
అందుకే తెలంగాణ పోలీసులు పాత ఆలోచనకు కొత్త రూపకల్పన చేశారు. అదే డయల్ 112ని అభివృద్ధి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేశారు. ప్రమాదం ఏదైనా, సహకారం కావాలంటే 112కి కాల్ చేస్తే చాలు ఆ అవసరాన్ని బట్టి ఆయా డిపార్ట్మెంట్ కి చెందిన అధికారులు, సిబ్బంది క్షణాల్లో అక్కడికి వచ్చేలా చేస్తుంది. ఇదంతా మనం కాల్ చేసిన క్షణాల్లోనే జరిగిపోతుంది. మీ ఫోన్ సిగ్నల్ ఆధారంగా మనం ఎక్కడ ఉన్నామో కూడా ఇట్టే తెలుసుకొని ఆయా డిపార్ట్మెంట్ సిబ్బంది అక్కడికి వెళ్లేలా చేస్తుంది. అదే దీనికి ఉన్న స్పెషాలిటీ. ఇటీవల కాలంలో డీజీపీ జితేందర్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో స్టార్ట్ చేశారు. ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి డైరెక్టర్ గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కమలాసన్ రెడ్డిని నియమించారు. అనంతరం టెక్నీకల్ నిపుణులతో భేటి అయి అంతా సిద్ధం చేశారు.
పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన 100 నెంబర్, ఫైర్ డిపార్ట్మెంట్ కి చెందిన 101, అంబులెన్స్ కి చెందిన 108, ఉమెన్ సేఫ్టీకి చెందిన 181, చైల్డ్ ప్రొటెక్షన్ కి చెందిన 1098, డిజాస్టర్ మేనేజ్మెంట్ కి చెందిన 1077 నెంబర్లను అనుసంధానం చేశారు. అలా 112కి వచ్చిన కాల్స్ ఆధారంగా ఆయా శాఖల సిబ్బందిని అప్రమత్తం చేయడమే కాకుండా వారు త్వరగా అక్కడికి చేరుకునేల చేస్తారు. వాస్తవానికి జాతీయ రహదారులపై అక్కడక్కడ టెలిఫోన్ పరికరాలను.. కాల్ బాక్స్ లను మనం చూస్తుంటాము. ప్రమాదం జరిగిన వెంటనే వాటిని నుండి కాల్ చేస్తే హైవే పెట్రోలింగ్ సిబ్బందిని అలర్ట్ చేస్తారు. కానీ జాతీయ రహదారుల వెంట వుండే ఈ సౌకర్యాన్ని జనం ఎవ్వరు అంతగా పట్టించుకోరు. కొందరికి తెలియదనే చెప్పాలి. రాష్ట్రంలో జరిగే విపత్తు నివారణ కోసం తెలంగాణ పోలీసులు ప్రత్యేక సదుపాయాలతో ఈ సౌకర్యాన్ని డెవలప్ చేశారు.
రెండురోజుల్లో హైదరాబాద్, కరీంనగర్ కలిపి మూడు భారీ అగ్నిప్రమాదాల నుండి జనాల ప్రాణాలు, ఆస్తులు రక్షించగలిగారు. ప్రజలు అత్యవసర సమయాల్లో ఈ నెంబర్ గుర్తు పెట్టుకుని కాల్ చేస్తే సరిపోతుందని, ఎలాంటి సహకారం అయిన ఇట్టే చేయొచ్చునని డైరెక్టర్ కమలాసన్ రెడ్డి తెలిపారు. ఇటీవల కాలంలో పాతబస్తీలో జరిగిన అగ్నిప్రమాదం ఘటన చాలా బాధాకరమని ఒకే కుటుంబానికి చెందిన 17మంది చనిపోవడం, ఇలాంటి ఘటనలు జరగకుండా జనాలను అప్రమత్తం చేయడానికే 112ని అభివృద్ధి చేసి జనాల్లోకి వెళ్లేలా చేస్తున్నామన్నారు. మన కోసం మన సంక్షేమం కోసం ఏర్పాటైన ఈ నంబర్ ని ప్రతిఒక్కరు గుర్తించి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.