ఆ అధికారుల ఫొటోలు ట్యాంక్ బండ్ మీద పెట్టండి.. హైకోర్టు
హైదరాబాద్: అక్రమ నిర్మాణాలపై అధికారుల తీరు పట్ల తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అక్రమ నిర్మాణాల పట్ల చర్యలు తీసుకోని అధికారుల ఫోటోలను ట్యాంక్ బండ్‌పై ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. రాజేంద్రనగర్‌లోని తమ ప్రైవేటు భూమిలో కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, అధికారులు పట్టించుకోవడం లేదని సయ్యద్ రహీమున్నీసా మరో ఏడుగురు వ్యక్తులు హైకోర్టుని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేస్తూ, అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోని అధికారుల ఫోటోలను ట్యాంక్ బండ్‌పై ప్రదర్శించాలని జస్టిస్ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అక్రమ నిర్మాణాలు తొలగించాలని ఉత్తర్వులు జారీ చేశామని స్టాండింగ్ కౌన్సిల్ చెబుతోంది, టాస్క్ ఫోర్స్ అధికారులకు ఉత్తర్వులను పంపించామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. పోలీసుల నుండి భద్రత లేదని టాస్క్ ఫోర్స్ అధికారులు చెబుతున్నారు. అది శాంతిభద్రతల సమస్య అని పోలీసులు చెబుతున్నారు. ఇలా అందరూ చేతులు దులుపుకుంటే ఎలా అంటూ అధికారులపై అసహనం వ్యక్తం చేసింది. వచ్చే వాయిదాలోగా పిటిషనర్ ఇచ్చిన వినతి పత్రంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని అధికారులను హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.