"కోట్లాది హృదయాలలో నిలిచి.. పోయినావే!..." అలనాటి అందమైన తార బీ.సరోజాదేవి ఇకలేరు!
మనసు పరమలించెనే..తనువు పరవశించెనే అనగానే గుర్తొచ్చేది ఆమే. శ్రీకృష్ఱార్జున యుద్ధం సినిమాలో శ్రీకృష్ణుణి చెల్లిగా 'చిన్నన్నయ్యా' అన్న చిన్నపిల్లలా పిలుపు వినగానే శ్రవణానందం కలిగించే స్వరం ఆమెదే. జగదేక వీరుణి కథలో ఓ సఖి..ఓహో చెలి అనే పాటతో అందరి ఇష్టసఖిగా మారిన నాటి తరం మేటి నటి డాక్టర్ బి.సరోజా దేవి. పౌరాణిక,
సాంఘీక, జానపద వంటి ఎన్నో గొప్ప చిత్రాలలో హీరోయిన్ గా నటించి బెంగళూరులోని తన నివాసంలో సోమవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు.
17 ఏళ్లకే హీరోయిన్ ఆమె… 1955 నుంచి సుమారు 30 సంవత్సరాలలో వరుసగా 161 చిత్రాలలో ప్రధాన కథానాయికగా నటించిన ఏకైక భారతీయ నటి కూడా ఆమే. తమిళం, కన్నడంతో పోలిస్తే తెలుగులో ఒకింత తక్కువే… 1957లోనే తెలుగులో పాండురంగ మహాత్యంతో ప్రవేశించింది… కానీ తమిళ ఇండస్ట్రీ మాత్రం ఆమెను తెలుగమ్మాయిలానే భావించింది..ఆదరించింది. తమిళ సూపర్ స్టార్లు అందరూ ఆమెతో సినిమాలు చేసినవారే…తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో సరోజాదేవి నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్‌లతో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. 1942లో కర్ణాటకలో జన్మించిన సరోజాదేవి 13ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 200కు పైగా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.
తెలుగులో సినిమాలు అంటే ప్రమీలార్జునయుద్ధం, శ్రీకృష్ణార్జున యుద్ధం, రహస్యం, భాగ్యచక్రం, అమరశిల్పి జక్కన్న,ఆత్మబలం, సీతారామకళ్యాణం,భూలోక రంభ, ఇంటికి దీపం ఇల్లాలే, శకుంతల, మాయని మమత,విజయం మనదే, దాగుడు మూతలు, సీతారామవనవాసం, పెళ్లిసందడి, ఉమాచండీగౌరిశంకరులకథ , జగదేకవీరుని కథ, దానవీరశూరకర్ణ, మంచి చెడు, దాగుడుమూతలు, పండంటి కాపురం, పెళ్లి కానుక, అల్దుడు దిద్దిన కాపురం వంటి సినిమాలు గుర్తొస్తాయి… 1967లో పెళ్లయ్యాక కూడా బిజీ నటిగానే ఉంది.., కానీ భర్త మరణం తరువాత తను అంతకుముందు సంతకాలు చేసిన సినిమాలు పూర్తి చేసి, చాలా ఏళ్లపాటు సినిమాలు చేయడం మానేశారు.
సరోజా దేవి తండ్రి భైరప్ప పోలీసు శాఖలో ఉద్యోగి, తల్లి రుద్రమ్మ గృహిణి. 1967లో శ్రీ హర్ష అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆయన 1986లో మరణించారు. సరోజాదేవి ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని వారికి రామచంద్రన్, ఇందిరా అని పేర్లు పెట్టి పోషించారు.
సరోజా దేవి తన తండ్రితో తరచుగా స్టూడియోలకు వెళ్లేది, ఆమె నృత్యం చేసిన తర్వాత ఆమె వాచిన పాదాలకు మసాజ్ చేసేవాడు… అంతగా ప్రోత్సహించేది ఆ కుటుంబం… కాకపోతే తల్లి మాత్రం స్విమ్ సూట్లు, స్లీవ్‌లెస్ బ్లౌజులు ధరించకుండా నిషేధం విధించింది… కానీ నాలుగు భాషల్లో ప్రఖ్యాత హీరోలందరి సరసన నటించడానికి ఆ డ్రెస్ కోడ్డ అడ్డుపడలేదు…ఆమెను చూడగానే మనింట్లో ఆడపిల్లలా అనిపిస్తుంది. నిండుదనం, చురుకుతనం, మంచితనం, అభినయ నైపుణ్యం ఇలా ఎన్నో లక్షణాలు బి.సరోజాదేవిని శిఖరస్థాయికి చేర్చాయనడంలో సందేహం లేదు.
1950లలో కన్నడ, తమిళం, తెలుగు, హిందీ భాషలలో నటించిన అతి కొద్ది మంది నటీమణులలో ఆమె ఒకరు… చతుర్భాషా తార అని కొందరు పిలిచేవాళ్లు… ఎంజీఆర్ చిత్రాలకు ఆమె ‘లక్కీ మస్కట్’… 26 సినిమాలు చేసింది ఆయనతో… ఫేమస్ తెరజంట… సేమ్, వాణిశ్రీ… మహిళలు ఆమె డ్రెస్సింగ్ సెన్స్‌ను ఆరాధించారు… ఆమె చీరలు మరియు బ్లౌజ్‌లు, ఆభరణాలు, కేశాలంకరణను అమ్మాయిలు బాగా అనుసరించేవాళ్లు… ఓ ఫ్యాషన్ ఐకన్ 1960ల కాలంలో.
బి. సరోజాదేవి సినీరంగానికి చేసిన సేవలకు భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో గౌరవించింది. అనేక రాష్ట్ర, జాతీయ అవార్డులు ఆమె ఖాతాలో ఉన్నాయి. తమిళ్, కన్నడ, తెలుగు చలనచిత్ర పరిశ్రమల నుంచి ఆమెకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు లభించాయి. 2009లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, నాట్య కళాధర అవార్డులు అందుకుంది. 2007లో రోటరీ శివాజీ అవార్డు , ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు - సౌత్ అవారర్డును సైతం సరోజాదేవి అందుకున్నారు. ఆమె 1998, 2005లో 45వ, 53వ జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీ అధ్యక్షురాలిగా వ్యవహరించారు. 2010లో, భారతీయ విద్యా భవన్ "పద్మభూషణ్ బి. సరోజాదేవి నేషనల్ అవార్డు"ను ప్రవేశపెట్టింది. ఇది ప్రదర్శన కళలలో కళాకారులను గౌరవించే జీవన సాఫల్య అవార్డుగా నిలిచింది.
సరోజాదేవి వెండితెరపై చూపించిన విలక్షణమైన నటన, శీలవంతమైన ప్రవర్తన, విలువలతో కూడిన పాత్రలు ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. బి. సరోజాదేవి మిగిల్చిన కళా వారసత్వం భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా నిలుస్తుంది.
ఏడు దశాబ్దాలు… 200 సినిమాలు… భారతీయ సినిమా చరిత్రలో అత్యంత విజయవంతమైన తారల్లో ఆమె పేరూ సువర్ణాక్షరాలతో లిఖించి ఉంటుంది… ఓ దశలో హైలీ పెయిడ్ ఆర్టిస్టు ఆమె… అంత డిమాండ్ ఉండేది… నేటి తరాలకు ఆమె తెలియకపోవచ్చు… చాలా ఏళ్లు ఆమె ఫిమేల్ సూపర్ స్టార్… తెలుగు, కన్నడం, తమిళం, హిందీ భాషల్లోనూ సక్సెస్‌ఫుల్ స్టార్…అందుకే ఆమె మృతిపట్ల సినీ ప్రముఖులు, ఆమెను ఆరాధించే అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు అశేష అభిమానుల తరపున అశ్రు నివాళి.