ఆంధ్రా క్రికెట్ ఫ్రాంచైజీల వెనక ఏం జరుగుతోంది?
వాళ్లు క్రికెట్ ఆడేవాళ్లు కాదు.. బ్యాట్ పట్టుకునేవాళ్లు అసలే కాదు. కాని క్రికెట్ తోనే ఆడుకుంటారు. దాని పేరుతో గట్టిగా సంపాయిం చేస్తారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ గురించి చెప్పుకునే మాటలు ఇవే. ఇదే కాదు.. బీసీసీఐ నుంచి ఏ అసోసియేషన్ అయినా ఆడేవాళ్ల కంటే ఆడించేవాళ్లదే హవా. జైషా ఈ రోజు ఎలా శాసిస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. అలాగే మన ఏపీలో కొందరు రెడీ అయిపోయారు. వీళ్లే కాదు.. వీళ్ల కంటే ముందు నడిపించినోళ్లు కూడా ఇదే బాపతు అని చెప్పాలి. కాకపోతే వీరి రేంజ్ వేరు.. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో పాటు రాజ్యసభ సభ్యులు సానా సతీష్. ఇద్దరూ పలుకుబడి గట్టిగా ఉన్నవాళ్లే. ఎన్నారైల నుంచి ఢిల్లీ దాకా లాబీయింగ్ నడపగల సమర్ధులే. అందుకే వీరి వ్యవహారం వేరే రేంజులో ఉంటుంది మరి.
ఐపీఎల్ లాగా ఎపీఎల్ అని గతంలో ప్లాన్ చేశారు. ఆరు ఫ్రాంచైజీలను ఎంపిక చేశారు. భారీగా కోట్లలోనే కట్టించుకున్నారు. కాని ఎన్నికలు అయిపోయాక.. పవర్ చేతులు మారాక.. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కూడా చేతులు మారింది. కేశినేని చిన్ని, సానా సతీష్ కంట్రోల్ లోకి వచ్చింది. ఇప్పుడు వీళ్లు కూడా కొత్తగా ఫ్రాంచైజీలు అని బిడ్స్ పిలవాలని మొదలెట్టారు. కాని పాత ఫ్రాంచైజీలు వైజాగ్ వారియర్స్, బెజవాడ టైగర్స్, కోస్టల్ రైడర్స్ .. ఇలా ఉన్న ఆరుగురు హైకోర్టుకెళ్లి పిటిషన్ వేశారు. తాము ఆల్రెడీ ఉండగా.. అగ్రిమెంట్ ఉండగా.. మళ్లీ కొత్తవాళ్లను ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. హైకోర్టు కొత్త బిడ్స్ పై స్టే విధించింది. అయినా తర్వాత కూడా కేశినేని చిన్ని, సానా సతీష్ లు ప్రెస్ మీట్ పెట్టి.. తాము కొత్త బిడ్స్ పై ముందుకే వెళతామని ప్రకటించారు. లీగల్ సమస్యలు ఏమైనా ఉంటే లీగల్ గా చూసుకుంటామన్నారు. ఏపీ మొత్తం క్రికెట్ మ్యాచ్ లు పెడతామని.. క్రీడాకారులను డెవలప్ చేస్తామని చెప్పారు.
అయితే ఈ కొత్త ఫ్రాంచైజీల వ్యవహారం డబ్బులు దండుకోవడానికేనని ఆరోపణలు గట్టిగా వినపడుతున్నాయి. పెద్దపెద్దోళ్లు ఈ ఫ్రాంచైజీల కోసం ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. పాత ఫ్రాంచైజీలు కూడా కొనసాగాలన్నా.. వారికి కూడా కావాలన్నా.. వాళ్లు కూడా కప్పం కట్టాల్సిందే అంటున్నారని కామెంట్స్ వినపడుతున్నాయి. ఇంకో ఆందోళనకరమైన అంశం ఏంటంటే అమరావతిలో ప్రతిష్టాత్మకంగా కట్టబోతున్న అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం కూడా వీరి ఆధ్వర్యంలోనే ఉంటుందని చెప్పడం. అంటే అందులో కూడా.. వ్యవహారాలు నడుస్తాయా అన్న అనుమానాలు వినపడుతున్నాయి. కేశినేని చిన్ని వర్గం మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. క్రీడాభివృద్ధికి, ఆంధ్రాలో క్రికెట్ ను, క్రికెటర్లను డెవలప్ చేయడానికే తప్ప వేరే ఏ ఆలోచనలు లేవని వివరిస్తున్నారు.