భవిష్యత్తుపై మాజీ సీఎం జగన్ సంచలన ప్రకటన.. ఆ ఫార్ములా వర్కవుట్ అవుతుందా..?

By PC RAO
On
భవిష్యత్తుపై మాజీ సీఎం జగన్ సంచలన ప్రకటన.. ఆ ఫార్ములా వర్కవుట్ అవుతుందా..?

భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన మాజీ సీఎం జగన్

వచ్చే ఎన్నికల్లోగా మరోసారి ప్రజల్లోకి

జగన్ ఫార్ములా మళ్లీ వర్కవుట్ అవుతుందా..?

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) కీలక ప్రకటన చేశారు. మరోసారి పాత ఫార్ములాతోనే జనంలోకి వెళ్లాలనుకుంటున్నట్లు వెల్లడించారు. 2019 ఎన్నికల కంటే ముందు ప్రజాసంకల్ప యాత్ర పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. ఆ ఎన్నికల్లో ఏకంగా 151 అసెంబ్లీ స్థానాల్లో విక్టరీ కొట్టారు. 2019 నాటి పరిస్థితులే మళ్లీ రాష్ట్రంలో రిపీట్ అవుతున్నాయంటూ తన యాత్ర 2.0పై స్పష్టత ఇచ్చారు. 2027 నుంచి మరోసారి పాదయాత్ర చేయనున్నట్లు వైసీపీ యువజన విభాగంతో సమావేశం సందర్భంగా వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారిగా 2003లో మండువేసవిలో సుమారు 1467 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన వైఎస్ఆర్ నాటి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. 2004లో సీఎంగా బాధ్యతలు చేపట్టి మహానాయకుడిగా..మనసున్న ముఖ్యమంత్రిగా చెరగని ముద్రవేశారు.

ఆ తర్వాత వైఎస్ జగన్ తొలిసారిగా 2017 నవంబర్‌ 6న కడప జిల్లా ఇడుపులపాయలో  తన పాదయాత్రను ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల మీదుగా ప్రజాసంకల్ప యాత్రను 3,648 కిలోమీటర్లు కొనసాగించారు. ఆ తర్వాత  14జిల్లాల్లో 116 నియోజకవర్గాల్లో 230 రోజుల పాటు 2250 గ్రామాల మీదుగా 3,112 కిలోమీటర్ల మేర వైఎస్ జగన్ సోదరి షర్మిల ప్రజా ప్రస్థాన యాత్ర చేపట్టి విజయవంతమయ్యారు.  ఆతర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి నాటి ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు సైతం 'వస్తున్నా మీకోసం' అంటూ పాదయాత్ర చేశారు. 208 రోజుల పాటు 2,817 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆయనకు వయసు అయిపోలేదని నిరూపించారు. ఆ తర్వాత ఆయన వారసుడు నారా లోకేశ్ యువతే లక్ష్యంగా యువగళం పాదయాత్ర నిర్వహించారు. 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల మేర 100 నియోజకవర్గాల్లో తన జైత్రయాత్ర కొనసాగించారు.

ఇది చదవండి: ఆరా మస్తాన్ ఫోన్ ట్యాప్‌కు కారణం అదేనా.. విచారణ అనంతరం ఏమన్నారంటే..!

 తన రికార్డును తానే బద్ధలు కొట్టడమే లక్ష్యంగా జగన్ యాత్ర 2.0లో 5వేల కిలోమీటర్ల పాదయాత్రకు రంగం సిద్ధం చేస్తున్నారట.పనిలో పనిగా నారా లోకేశ్ సెట్ చేసిన యాత్ర మైలురాయిని దాటేలా వైఎస్ జగన్ యాత్ర 2.0 ఉండాలని ఆయన అభిమానశ్రేణులు భావిస్తున్నాయి. జగన్ కి ఫ్యాన్ బేస్ ఉందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన అడుగు పెడితే వేలాది మంది జనం గుమిగూడటం తరచూ జరుగుతున్న సంఘటనల్లో చూస్తున్నాం. కానీ  ఆయన పాదయాత్రకు నాటి ఆదరణ ఇప్పుడు దక్కుతుందా అనేది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే భావోద్వేగాలు, అసంతృప్తులు, రాజకీయ వ్యూహాలతో ముడిపడిన అంశాలనేకం.  ఇటీవలే ఏడాది పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం అయిపోయిందని చెప్పడానికి వీల్లేదు.   ఇంకా కొంచెం టైమివ్వాల్సిందే.

Advertisement

Latest News