ఆరా మస్తాన్ ఫోన్ ట్యాప్ కు కారణం అదేనా? విచారణ అనంతరం ఏమన్నారంటే..
- 2020 నుంచే ఆరా మస్తాన్ ఫోన్ ట్యాప్ కు
- రేవంత్ రెడ్డితో మాట్లాడిన ఫోన్లు రికార్డ్
- ఫోన్ రికార్డ్స్ మస్తాన్ కు వినిపించిన సిట్ అధికారులు
- కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆరా మస్తాన్
తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఎంతో మంది రాజకీయ, మీడియా, సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ అయినట్టు స్పష్టమైంది. ఇప్పుడు ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్, ఆరా సంస్థ అధినేత ఆరా మస్తాన్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు. ఈ మేరకు ఆయన సాక్షిగా విచారణకు హాజరై సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. మరోసారి విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని సిట్ అధికారులు అయనకు చెప్పారు.
విచారణ అనంతరం బయటకు వచ్చిన ఆరా మస్తాన్.. వివిధ రాష్ట్రాల్లో సర్వేలు చేస్తున్న సమయంలో తన ఫోన్ ట్యాప్ అయినట్టు తెలిసిందని.. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. ఫోన్ ట్యాప్ చేయాలంటే బయపడాలన్నట్టు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇటువంటివి భవిష్యత్తులో మరోసారి జరగకుండా సమగ్రమైన విధానం తీసుకురావాలని కోరుతున్నట్టు ఆరా మస్తాన్ తెలిపారు. నేను రాజకీయ నాయకులతోపాటు స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడిన వందలాది కాల్స్ రికార్డు చేయడం శోచనీయం అన్నారు. తాను ఏ రాజకీయపార్టీకి చెందిన వ్యక్తిని కాదని.. ఫోన్ ట్యాప్ చేయడం వల్ల ఏం ప్రయోజనం పొందుతారో అర్థం కాలేదని వాంగ్మూలం ఇచ్చిన అనంతరం ఆరా మస్తాన్ అన్నారు.
2023 నవంబర్ లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డితో.. ఆరా మస్తాన్ మాట్లాడిన కాల్స్‌ను ప్రభాకర్‌రావు టీమ్ ట్యాప్ చేసింది. అంతేకాకుండా ఆరా మస్తాన్ వివిధ పార్టీల నాయకులతో మాట్లాడిన కాల్స్ కూడా ట్యాప్ అయ్యాయి. 2020 నుంచి ఆరా మస్తాన్ ఫోన్‌పై ప్రభాకర్‌రావు టీమ్ నిఘా పెట్టినట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఆరా మస్తాన్ ను 2గంటలపాటు విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆయనకు ఆడియోలు, ట్యాప్ అయిన డేటాను చూపించిన సిట్ అధికారులు వాంగ్మూలం నమోదు చేశారు.
సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఆరా సంస్థ ఇచ్చే సర్వే రిపోర్టులకు విశ్వసనీయత ఉంటుంది. అందుకే ఆయన ఫోన్ ట్యాప్ చేయించి అనుకూలంగా సర్వే రిపోర్టు వచ్చేలా ఆరా మస్తాన్ పై ఒత్తిడి చేసి ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది.