TDP-Janasena: అధిష్టానం ఆదేశాలు బేఖాతర్.. జనసేనపై టీడీపీ ఎమ్మెల్యే రాజకీయం!
విజయవాడ శివారు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే రాజకీయం
జనసేనకు పదవి దక్కకుండా అడ్డంకులు
అధిష్టానం నిర్ణయాన్ని అమలు చేయని వైనం
ఏపీ రాజకీయాల్లో టీడీపీ, జనసేనలది కీలక పాత్ర. ఎన్నికల్లో సమిష్టిగా పోరాడి విజయం సాధించినా కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం పరిస్థితులు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో జనసేన నేతలపై టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకుల డామినేషన్ పెరిగిపోయిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. తాజాగా జనసేనకు నామినేటెడ్ పోస్టులు దక్కిన చోట కూడా టీడీపీ ఎమ్మెల్యేలు రాజకీయం చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. విజయవాడ శివారులోని ఓ కీలకమైన, రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లో నిలిచే నియోజకవర్గంలో జనసేన నేతకు మార్కెట్ యార్డు ఛైర్మన్ వంటి కీలక పదవి వచ్చినా టీడీపీ ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. అధిష్టానం అన్ని వడపోతలు పోసి జనసేనలో చురుగ్గా పనిచేసిన నేతకు పదవిని అప్పగించింది. కానీ ఆ ఆనందాన్ని జనసేన నేతలకు లేకుండా చేస్తున్నారట అక్కడి లోకల్ ఎమ్మెల్యే.
సాక్షాత్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి ఫైనల్ చేసినా ఆ నేతను కాదని.. తనకు నచ్చిన వ్యక్తిది ఆ పదవిని కట్టబెట్టేందుకు నే యోచనలో సదరు టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారని జనం అంటున్నారు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. జనసేన నేతకు పదవి వచ్చి నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆ టీడీపీ ఎమ్మెల్యే డైరెక్టర్ల జాబితాను ప్రభుత్వానికి పంపకుండా కావాలనే తాత్సారం చేస్తున్నారట. మార్కెట్ యార్డు ఛైర్మన్ నియోజకవర్గానికి చెందిన మరో టీడీపీ నేతకు కట్టబెడతానని సదరు ఎమ్మెల్యేగారు మాట కూడా ఇచ్చారట. జాబితా వచ్చిన తర్వాత కూడా ఆయన ఇదే మాటను తన సన్నిహితులకు కూడా చెప్పినట్లు సమాచారం.
పొత్తు ధర్మం పాటించాల్సిన చోట.. అధిష్టానం ఇచ్చిన జాబితాను ధిక్కరించేలా చేయడం ఏంటని జనసైననికులు ఎమ్మెల్యేపై మండిపడుతున్నారు. ఎమ్మెల్యేనే ఇలాంటి చర్యలకు పాల్పడితే టీడీపీలోని మిగతా నాయకులు, కార్యకర్తలు జనసేనన ఎలా కలుపుకొని వెళ్తారని ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గంలోని కాపు సామాజికవర్గంతో పాటు పవన్ కల్యాణ్ అభిమానులు సైతం కలిసికట్టుగా పనిచేస్తేనే సదరు ఎమ్మెల్యేగారు గెలుపొందారనే విషయాన్ని గుర్తెరిగాలని కూడా సూచిస్తున్నారు.
ఇప్పటికే ఆ ఎమ్మెల్యేపై నియోజకవర్గంలో వ్యతిరేకత వచ్చిందని అధిష్టానానికి కూడా నివేదికలు అందాయి. ఆయన ఒంటెత్తు పోకడలను సైతం నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు మిత్రపక్షాన్ని కూడా ఇబ్బంది పెడుతుండటంతో ఆయనపై అసంతృప్తి పెరుగుతోంది. ఇకనైనా సదరు ఎమ్మెల్యే తన పద్ధతిని మార్చుకొని అందరినీ కలుపుకుపోవాలని సొంత పార్టీతో పాటు జనసేన నాయకులు కూడా సూచిస్తున్నారు.