ఆందోళనగా ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి..
- వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు..
- దాతల కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు..
తెలుగు చిత్ర పరిశ్రమలో కామెడీ విలన్గా " ఫిష్ వెంకట్ " ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. విలన్ గ్యాంగ్ లో ఉంటూనే తనదైన స్టైల్లో కామెడీని పండిస్తూ ప్రేక్షకులను నవ్వించారు. ముఖ్యంగా వీవీ వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన 'ఆది' సినిమాలో (aadifilim) "తొడకొట్టు చిన్నా" అనే డైలాగ్తో మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత నుంచి వరుస ఆఫర్లతో టాప్ హీరోలందరి సినిమాల్లో నటించారు. బన్నీ, రెడీ, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్.. సహా ఎన్నో చిత్రాల్లో కనిపించిన ఫిష్ వెంకట్ ఇప్పుడు ఆరోగ్యం విషమించి హాస్పిటల్ బెడ్ పై సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు ఫిష్ వెంకట్. గత 9 నెలలుగా కిడ్నీ సమస్యలతో డయాలసిస్ తీసుకుంటున్న వెంకట్, ఇటీవల మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఎదుటి వ్యక్తిని కూడా గుర్తుపట్టలేని స్థితికి ఆయన చేరుకోవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆసుపత్రి ఖర్చులు భరించలేమని.. సాయం చేయాలని దాతలను విజ్ఞప్తిచేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాలుగేళ్ల క్రితం మద్యం కారణంగా షుగర్, కాలు ఇన్ఫెక్షన్ వచ్చాయి. ఆ సమయంలో సినీ ప్రముఖులు, దాతలు కలిసి సాయం చేయడంతో ఆయనకు శస్త్రచికిత్స జరిగి ప్రాణాలు దక్కాయి. ఆపరేషన్ తరువాత సినీ అవకాశాలు తగ్గిపోవడంతో వెంకట్ కుటుంబం ఆర్థికంగా కష్టాల్లోకి వెళ్లింది. అయితే తర్వాత మళ్లీ మందు, సిగరెట్ అలవాట్లు వదలలేకపోయారని.. ఆ కారణం గానే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన భార్య ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త స్నేహితులే ఇంటికి వచ్చి మళ్లీ అలవాటు చేశారని.. కానీ ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నా కూడా ఎవ్వరూ చూడటానికి కూడా రావడం లేదని వాపోయారు. అభిమానులు, సినీ సంఘాలు, దాతలు, ప్రముఖులు, ప్రభుత్వ పెద్దలు తమను ఆదుకోవాలని కోరుతున్నారు. దురలవాట్లు ఎప్పటికైనా జీవితాన్ని నాశనం చేస్తాయని చెప్పడానికి ఇది మరో ఉదాహరణ అంటూ అభివర్ణిస్తున్నారు.