ఇంటికి పిలిపించుకుంటారా? వైఎస్ జగన్ తీరుపై విమర్శలు..
* తాడేపల్లికి సింగయ్య, జయవర్ధన్ కుటుంబ సభ్యులు
* అండగా ఉంటామంటూ భరోసా
* సాక్షులను ప్రభావితం చేస్తున్నారని టీడీపీ విమర్శ
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పంథా మార్చుకున్నారా? ఇటీవల కాలంలో పార్టీ కార్యకర్తలయినా, సామాన్య ప్రజలైనా నేరుగా వారి ఇంటికి వెళ్లి పరామర్శించేవారు. జగన్ వెళ్తున్నారంటే పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ హంగామా చేసేవారు. వందల సంఖ్యలో కార్లు, వేల సంఖ్యలో కార్యకర్తలతో ఇంటి నుంచి బయల్దేరి పరామర్శలకు వెళ్లేవారు. కానీ ఇటీవల పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా జగన్ కారుకింద పడి చీలి సింగయ్య మృతి చెందిన ఘటనతోపాటు తోపులాటలో జయవర్ధన్ అనే వ్యక్తి చనిపోయారు.
ముఖ్యంగా సింగయ్య మృతి చెందిన విధానం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటనలో జగన్ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లారు. ఈ కేసులో జగన్ కు తాత్కాలిక ఊరట లభించింది. స్టే విధిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ఏజీ 2 వారాల గడువు కోరడంతో తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఓ వైపు కేసు విచారణ జరుగుతుండగానే జగన్ పర్యటన సందర్భంగా చనిపోయిన వారి కుటుంబ సభ్యులను తాడేపల్లిలోని తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. వైసీపీ నాయకులు సింగయ్య భార్య లూర్థు మేరి, కుమారులు, ఇతర కుటుంబ సభ్యులను జగన్ వద్దకు తీసుకువచ్చారు. అటు జయవర్ధన్‌రెడ్డి తల్లిదండ్రులు సావిత్రి, భాస్కరరెడ్డి, సోదరుడు మణికంఠరెడ్డి, కుటుంబసభ్యులను కూడా రప్పించారు. ఇరువురి కుటుంబాలకు ఏ మాత్రం అధైర్యపడొద్దు. మీకు ఏ సమస్య వచ్చినా, మీ కుటుంబానికి అండగా ఉంటాము’ అని ఎంతో ధైర్యం చెప్పారు. భరోసా ఇచ్చారు.
అయితే జగన్ తన వాహనం కిందపడి చనిపోయిన సింగయ్య భార్య మేరీని పిలిపించుకుని పరామర్శించడం చట్టారీత్యా నేరమని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. శవరాజకీయాల్లో జగన్ దిట్ట అని.. పరామర్శ పేరుతో సింగయ్యను పొట్టనబెట్టుకోవడమే కాకుండా.. ఆయన భార్యను బెదిరించి, అబద్ధాలు చెప్పిస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఈ కేసులో జగన్ ఏ2గా ఉన్నారని.. ఫిర్యాదుదారు మేరీని ఇంటికి పిలిపించడం. ప్రలోభపెట్టడం, బెదిరించడం, మీడియా ముందు మాట్లాడించడం నేరమని... కోర్టు, పోలీసులు దీన్ని సుమోటోగా తీసుకోవాలని జగన్‌ను అరెస్ట్ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.