రాయచోటిలో 'అల్ ఉమ్మా' ఉగ్రవాదులు.. పేలుళ్లకు కుట్ర భగ్నం
* ఇద్దరు అల్-ఉమ్మా ఉగ్రవాదుల భార్యలు అరెస్ట్
* నిందితుల ఇళ్లలో భారీగా పేలుడు పదార్థాలు
* 14 రోజుల రిమాండ్.. కడప జైలుకు తరలింపు
ఏపీలో ఉగ్రవాదుల కలకలం రేగింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇటీవల తమిళనాడు ఐబీ పోలీసులు ఇద్దరు ఉగ్రవాదులు అబూబకర్ సిద్ధిఖీ, మహ్మద్ అలీని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా విచారణ జరిపిన అన్నమయ్య జిల్లా పోలీసులు ఇద్దరు ఉగ్రవాదుల భార్యలను కూడా అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. అరెస్టయిన ఉగ్రవాదులు 'అల్ ఉమ్మా' ఉగ్రవాదులని.. దేశంలోని మూడు ప్రధాన నగరాల్లో పేలుళ్లకు కుట్రపన్నిట్టు గుర్తించామని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు.
14 రోజుల రిమాండ్..కడప జైలుకు తరలింపు
ఇద్దరి ఇళ్లలో జరిపిన సోదాల్లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు లభ్యయ్యాయి. నిందితుల నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, ఫ్యూయల్ ఆయిల్ కలిపిన అమ్మోనియం నైట్రేట్, గన్ పౌడర్ తోపాటు దేశంలోని మూడు ప్రధాన నగరాల రైల్వే నెట్‌వర్క్‌ల మ్యాప్‌లు దొరికాయని కోయ ప్రవీణ్ వివరించారు. ఈ మేరకు నిందితుల కుటుంబసభ్యులపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. అబూబకర్ సిద్ధిఖీ భార్య షేక్ సైరాభాను, మహ్మద్ అలీ భార్య షేక్ షమీమ్‌నుకోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిని కడప కేంద్ర కారాగారానికి తరలించారు.
రాయచోటిలో స్థిరనివాసం
రాయచోటిలో నిందితులకు సహకరిస్తున్న వారిపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. దశాబ్ధానికిపైగా ఇద్దరు వ్యక్తులు ఇక్కడే ఉంటున్నారు. అబూబకర్ సిద్ధిఖీ రాయచోటికి చెందిన మహిళను పెళ్లి చేసుకోగా.. మహ్మద్ అలీ సుండుపల్లికి చెందిన మహిళను వివాహం చేసుకుని స్థానికులుగా చలామణి అవుతున్నారని పోలీసులు గుర్తించారు. అయితే వీరిద్దరూ రాయచోటిలో నియామకాలు, శిక్షణ ఇచ్చినట్లు విచారణలో నిర్ధరణ కాలేదన్నారు.
బాంబు పేలుళ్లకు కుట్ర
దక్షిణాది రాష్ట్రాల్లో బాంబు పేలుళ్ల ఘటనలో అబూబకర్ సిద్ధిఖీ, మహ్మద్ అలీ పాత్ర ఉన్నట్టు ఆధారాలు కూడా లభ్యయయ్యాని తెలుస్తోంది. మహ్మద్ అలీ కిరాణా షాప్, అబూబకర్ సిద్ధిఖీ బట్టల షాపు నడుపుతూ పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు బట్టల వ్యాపారం పేరుతో సాధారణ జీవితం గడుపుతున్న వీరికి ఉగ్రవావాద కార్యకలాపాలతో సంబంధం ఉందని తెలియడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు.