ఐపీఎస్ ఉద్యోగానికి అందుకే రాజీనామా.. సిద్ధార్థ్ కౌశల్ సంచలన లేఖ!
వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా
ఒత్తిళ్లు అన్న ప్రచారం అవాస్తవం
ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ లేఖ
ఆంధ్రప్రదేశ్ యువ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఐపీఎస్ ఉద్యోగానికి వ్యక్తిగత కారణాలతో పాటు, కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. సమాజానికి కొత్త రీతుల్లో సేవ చేయాలని భావిస్తున్నట్టు లేఖలో తెలిపారు.
తన రాజీనామాపై పలు నిరాధార ఆరోపణలను కలిసి దుష్ప్రచారం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. అవన్నీ పూర్తిగా అబద్ధమని ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ తన లేఖలో వెల్లడించారు. ఒత్తిళ్లతో రాజీనామా చేసినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. రాజీనామా పూర్తిగా వ్యక్తిగత, స్వచ్ఛంద నిర్ణయమే అని ఆయన స్పష్టం చేశారు.
ఏపీలో తన ఉద్యోగ కాలమంతా అత్యంత సంతృప్తికరంగా సాగిందన్నారు. ఈ రాష్ట్రాన్ని సొంత ఊరిగా భావించానని, ఇక్కడి ప్రజలపై తనకున్న ప్రేమ ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. తన లేఖలో ఏపీ ప్రభుత్వానికి, సీనియర్లకు, సహచరులకు, జూనియర్లకు, తనకు సేవ చేసే అవకాశం ఇచ్చిన ప్రతి పౌరుడికి కృతజ్ఞతలు చెప్పారు.
ఏపీ 2012 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సిద్ధార్థ్ కౌశల్ కృష్ణా, ప్రకాశం, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ఎస్పీగా పని చేశారు. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరిస్తారని, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగరన్న గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఏపీ డీజీపీ కార్యాలయంలో ఎస్పీ (అడ్మిన్)గా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన తన విధులకు హాజరుకాకపోవడంతో.. వీఆర్ఎస్ కు దరఖాస్తు చేశారన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు తాను ఎందుకు రాజీనామా చేశానన్నది లేఖ ద్వారా ప్రకటించి దుష్ర్పచారానికి తెరదించారు.