ముచ్చుమర్రి బాలిక అదృశ్యమై..ఏడాది పూర్తి..! కేసులో పురోగతి ఏది? బాధితులకు న్యాయమెప్పుడు?
ముచ్చుమర్రి బాలిక ఘటన.. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ సంచలనం రేపిన ఉదంతమిది. ఎనిమిదేళ్ల ఓ బాలికను ముగ్గురు మైనర్ బాలురు కలిసి అత్యాచారం చేసి హత్య చేసిన వైనం రెండు తెలుగు రాష్ట్రాలనూ ఉలిక్కిపడేలా చేసింది. ఆడుకుంటున్న బాలికను ముగ్గురు బాలురు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేసి.. ఆపై హత్య చేశారనే వార్త రాష్ట్ర ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ వ్యవహారంపై అప్పట్లో అధికార, ప్రతిపక్షాల మధ్యన పెద్ద వాగ్వాదమే నడిచింది. అయితే ఘటన జరిగి ఏడాది పూర్తయినా.. నేటికి ఆ బాలిక ఆచూకి లభించలేదు. ఈ దారుణం జరిగి జూలై 7 నాటికి సరిగ్గా సంవత్సరం పూర్తయింది.
ఈ ఘటనలో నిందితులుగా ఉన్న ముగ్గురు మైనర్లు.. ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ సమీపంలోని కృష్ణా నది బ్యాక్ వాటర్‌లో బాలిక మృతదేహాన్ని పడేసినట్లు పోలీసులకు సమాచారం అందించారు. ఇక అప్పటి నుంచి పోలీసుల గాలింపు చర్యలు మొదలయ్యాయి. డ్రోన్ల సాయంతోనూ, గజ ఈతగాళ్లతోనూ గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. గ్రామ సమీపంలో బాలిక మృతదేహం ఆచూకీని కనిపెట్టడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో తెలంగాణ వైపు ఉన్న కృష్ణానదిలో గాలించారు. మరోవైపు బాలిక తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కేసు విచారణ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిందితులు బెయిల్ పై వచ్చి స్వేచ్చగా బయట తిరుగుతున్నారు. ఏ తప్పు చేయని మేం బిడ్డను దూరం చేసుకుని శిక్ష అనుభవించాలా?. వాళ్లకు బహిరంగంగా ఉరిశిక్ష వేస్తేనే మా కూతురి విషయంలో న్యాయం జరిగినట్లు’’ అని ఆమె తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జులై ఏడో తేదీన నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఎనిమిదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన వెలుగుచూసింది. ఆడుకుంటున్న బాలికను 13 నుంచి 15 ఏళ్ల వయసు ఉన్న ముగ్గురు బాలురు పంప్ హౌస్ వద్దకు తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. అయితే తమ కూతురు కనిపించడం లేదంటూ బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసుల విచారణ ప్రారంభమైంది. దర్యాప్తులో ముగ్గురు మైనర్ బాలురు.. బాలికను తమతో తీసుకెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే నమ్మలేని విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలికపై అత్యాచారం చేసి.. ఆపై హత్య చేసి పంప్ హౌస్‌లోకి పడేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించారు. విచారణలో బాలురకు వారి పెద్దలు కూడా సహకరించినట్లు స్పష్టమైంది. మైనర్ బాలురు, వారి కుటుంబసభ్యులు తప్పుదోవ పట్టించేలా వాంగ్మూలాలు ఇచ్చారని.. అందుకే ముచ్చుమర్రి బాలిక మృతదేహం ఆచూకీ కనుగొనడంలో విఫలమయ్యామని పోలీసులు చెబుతున్న మాట.
ఈ కేసులో పోలీసుల అలసత్వంపై మొదటి నుంచి విమర్శలున్నాయి. తల్లిదండ్రులు బాలిక కనిపించకుండా పోయిన రోజున ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ప్రజా సంఘాల ఒత్తిడితో రెండు రోజుల తర్వాత నుంచి విచారణ ప్రారంభించారు. జులై 10న నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తే చిన్నారిని రేప్ చేసి చంపేసినట్లు నేరాన్ని ఒప్పుకున్నారు. నిందితులు బాలిక శవాన్ని గుర్తించడంలో పోలీసులు పూర్తి వైఫల్యం చెందారని బాధితులు చెబుతున్నారు. అలాగే.. ప్రభుత్వం స్పందించిన తీరుపైనా ఆ టైంలో తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. తమకు న్యాయం చేయాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఆ తల్లిదండ్రులు పలు టీవీ ఛానళ్ల ఇంటర్వ్యూల ద్వారా విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అటుపై ఈ కేసును ప్రభుత్వం, పోలీసులు పూర్తిగా గాలికొదిలేశారు. ఏడాదైనా ఈ కేసు విషయంలో ఎటువంటి పురోగతి లేకపోవడం, ప్రభుత్వం మౌనం దాల్చడం ఆ కుటుంబాన్ని మరింత విషాదంలోకి నెట్టింది.