హైదరాబాద్ లో టెన్షన్.. టెన్షన్.. పలుచోట్ల బాంబు బెదిరింపు..
హైదరాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికంగా ఉన్న సిటీ సివిల్ కోర్టులో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ అనూహ్య మెయిల్ తో కోర్టు సిబ్బంది వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో కలిసి తక్షణమే కోర్టు ప్రాంగణానికి చేరుకొని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అయితే సిటీ సివిల్ కోర్టుతో పాటు రాజ్భవన్, జింఖానా క్లబ్, సహా మరో రెండు చోట్ల బాంబు పెట్టినట్టు మెయిల్ చేశాడు. ఆ ప్రదేశాల్లో కూడా పోలీసులు తనిఖీలు చేపట్టారు. బాంబు ఉంచినట్టు సమాచారం ఇచ్చిన వ్యక్తి ఎవరు? మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కోర్టు చీఫ్ మెజిస్ట్రేట్ ఆదేశాలతో కోర్టు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసి.. కోర్టులో ఉన్న అధికారులు, లాయర్లు, సాధారణ ప్రజలను వెంటనే బయటకు పంపించారు. అనంతరం కోర్టు భవనంలోని ప్రతి మూలను బాంబ్ డిటెక్షన్ టీం పూర్తిగా తనిఖీ చేస్తోంది. ఈ బాంబు బెదిరింపుల విషయంలో ఎంతవరకు నిజం ఉందన్నది ఇప్పటికీ స్పష్టతకు రాలేదు. కాగా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. బాంబు వ్యవహారం పూర్తిగా నిర్ధారణ అయిన తర్వాత వెల్లడిస్తామని తెలిపారు. భద్రతా చర్యల భాగంగా కోర్టు ఆవరణలో పటిష్ట తనిఖీలు జరుపుతున్నామని స్పష్టం చేశారు. ఈ ఘటనతో కోర్టు సహా ఆయా ప్రాంతాల పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. అక్కడకు భారీగా పోలీసులు మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఊహించని ఘటనతో గతంలో భాగ్యనగరంలో చోటు చేసుకున్న బాంబ్ బ్లాస్ట్ ఘటనలను గుర్తు చేసుకొని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.