వేడెక్కిన ఏపీ బ్యూరోక్రసీ!
ఇక బాస్ చెప్తే కాదు...రూల్స్ చెబితేనే!
ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు ఐఏఎస్ లపై పగబట్టడంపై మౌనం
ఐఏఎస్, ఐపీఎస్‌లు సహా చిరుద్యోగులపైనా ప్రతాపం
ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పని చేయాలంటే ఐఏఎస్‌లు చాలా ఆసక్తి చూపేవారు. కానీ, ఐదేళ్లకోసారి ప్రజాతీర్పుతో మారుతున్న విభజిత ఏపీలో పని చేయాలంటేనే బ్యూరోక్రాట్స్ భయపడుతున్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల ఆదేశాలతో పని చేసే అధికారులని తర్వాత మారిన ప్రభుత్వాలు వేధించడం వేరే ఏ రాష్ట్రాల్లోనూ లేదు. సచివాలయాలు, కార్పొరేషన్లలో తమ వారిని నింపి తమకు తగిన పాలన అందించి వెళ్లిపోతే..వెంటనే వచ్చే కొత్త ప్రభుత్వాలు వారిని అందరినీ ఒకేగాడిన కట్టి అర్హత, అనుభవం, చేసిన మంచిని కూడా లెక్కచేయకుండా అందరినీ గత ప్రభుత్వంలో చేయడమే వారి అనర్హతగా చూస్తుండడం ఆందోళన కలిగించే అంశం. ప్రైవేట్ కన్సల్టెంట్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, సాధారణ అటెండర్లపైనా కక్షసాధింపులా ఉద్యోగాల్ని తొలగించి వారి కుటుంబాలను రోడ్డున పడేయడం వలన కొత్త ప్రభుత్వాలకు చెత్తపేరు తప్పా ఒరిగేదేంటి? అందరి ఓట్లతో గెలిచి..అన్నన్ని సీట్లు గెలిచి సగటు మనిషిని సమానంగా చూడలేని ప్రభుత్వం , చెప్పిన మాటలు, కట్టుకథలను నమ్మి నిర్దాక్షిణ్యంగా ఒక ఉద్యోగం కాదు ఒక కుటుంబం అని మరచి ప్రవర్తించడం వల్ల ఓట్లు పెరుగుతాయా? ఒకడి నోటి కాడి కూడు తీసి మనోడికే పెడతానంటే నువ్ కూడు లాగిన వాడు నీవాడు కాకపోగా..పగవాడు కాడా? దీనివల్ల అంతిమంగా సాధించేదేంటి?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు..అన్ని చోట్ల సామాజికవర్గాల అంచనాలు, తమ, పర భేదాలు షరా మామూలు. కానీ ఆల్ ఇండియా సర్వీసులకు చెందిన వారిపైనా ఒక స్థాయి దాటి వారిని వేధించడం వలన రాజకీయ క్రీడ ఎలా ముగుస్తుందో..చివరికి గెలిచేదెవరో కాలమే సమాధానం చెప్పాలి. సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్నీ, కాంతిరాణా టాటా వంటి వారిని టార్గెట్ చేసి కారణాలు చూపి మరీ వేధిస్తోందని మిగతా ఐఏఎస్, ఐపీఎస్ లు నిశ్శబ్దంగానే తమ అభిప్రాయాన్ని (కొందరు గట్టిగానే) చెబుతున్నారు. ఎంతో భవిష్యత్ ఉందని కలగని వచ్చిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా ఆయన వ్యక్తిగత నిర్ణయమని ప్రకటన ఇచ్చినా దాన్ని నిజమేనని నమ్మేవారెవరు?
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? పదే పదే మారుతున్న ప్రభుత్వాలు, వారు అవలంబించే విధానాల వల్ల వారు అలసిపోయారా? విసిగిపోయారా? మరో ప్రభుత్వం మారిన ప్రతిసారి ప్రాబ్లంలో పడేది మళ్లీ వారేనా? మంత్రుల ఆదేశాలతో ఫైల్స్ క్లియర్ చేసినా, ముఖ్యమంత్రి ఆదేశాలను పాటించినా భవిష్యత్ లో దుష్పరిణామాలు ఎదుర్కోక తప్పదనే స్పష్టతకు వచ్చినట్లు సెక్రటరీయేట్ లో పరిస్థితులు నెలకొన్నాయి. బదిలీలు, నిందితులనే చెడ్డపేరు, లూప్ లైన్ పోస్టుల బాధితులవడానికి సిద్ధంగానే ఉండొచ్చు గాక.. కానీ, "రెడ్ బుక్", "సప్త సముద్రాల అవతలున్నా పట్టుకొస్తాం" అన్న నాయకుల మాటలే బ్యూరోక్రాట్స్ స్ఫూర్తిని దారుణంగా దెబ్బతీస్తున్నాయ్. సివిల్ సర్వెంట్స్ గా దేశంలో గర్వించే స్థానం నుంచి బీ-గ్రేడ్ సర్వెంటులుగా రాజకీయాలు తమ స్థానాన్ని దిగజార్చడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఎంతో మంది ఉన్నతాధికారులు ఏ పోస్టూ లేకుండా ఖాళీగా ఉన్నారు. కొందరు ఉన్నా ఉపయోగం లేని ప్రాధాన్యత లేని చోటే పరిమితమయ్యారు.
ఈ వరుస అధికార'మార్పు'ల గుణపాఠంతో బ్యూరోక్రాట్స్ ఓ క్లారిటీకి వచ్చారు. మరో రాజకీయ పిడుగుపాటుకు బలి కాకముందే అప్రమత్తమవుతున్నారు. తర్వాత వచ్చే పరిణామాలను ముందే ఊహించి జాగ్రత్తగా నడుచుకుంటున్నారు. రూల్స్ కు కట్టుబడి..బాస్ ల దగ్గర మెత్తబడకుండా అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారు. అదే వారి భవిష్యత్ కోసం వారెంచుకున్న కొత్త మంత్రం. అలా లేకపోతే ప్రతి ఐదేళ్లకోసారి ఇబ్బంది పడడం ఖాయమని నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వాలన్నీ అధికారుల కొరత అని బాధపడేది నిజంగా అధికారులు లేక కాదు..వారికి వంతపాడే అధికారులు కావాలని. ఈ రాజకీయ యుద్ధంలో సమిధలుగా మిగలకుండా ప్రజలకు, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే పనులు చేయడం..బ్యూరోక్రసీకి నిజంగా పెను సవాలే!