పుస్తక ప్రియులకు బుక్ నూక్స్
ఏలూరు, జూన్ 14:
పుస్తక ప్రియుల కోసం ఏలూరులో ప్రారంభమైన బుక్ నూక్స్ కార్యక్రమం విస్తరణ దశలోకి ప్రవేశించనుంది. ప్రతి ఒక్కరిలో పఠనాసక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రి రెడ్డి తెలిపారు.
ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో శనివారం జరిగిన పుస్తక సేకరణ కార్యక్రమంలో, elurubooknooks.com అనే వెబ్‌సైట్‌ను జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు. ప్రస్తుతం మూడు బుక్ నూక్స్ కేంద్రాలు పనిచేస్తుండగా, త్వరలో వాటి సంఖ్యను 100కి పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. విద్య, సాహిత్యం, చరిత్ర, విజ్ఞానవంతమైన కథలు, పిల్లల పుస్తకాలు వంటి అనేక రకాల పుస్తకాలు అందుబాటులో ఉండనున్నాయని పేర్కొన్నారు. ప్రజలు తమ వద్ద ఉన్న పాత/కొత్త పుస్తకాలను ఈ కేంద్రాలకు అందించి, జ్ఞానాన్ని పంచాలని పిలుపునిచ్చారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే పుస్తకాలు సేకరించి, మరిన్ని ప్రాంతాల్లో వాటిని అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమం వేలాది మంది పాఠకులకు లబ్ధి చేకూర్చే విధంగా ఉంటుందన్నారు. పౌరులు తమ సమీప పుస్తక సేకరణ కేంద్రాల సమాచారం కోసం elurubooknooks.com సందర్శించవచ్చని సూచించారు.