మేడ్చల్ సొసైటీ కేంద్రం వద్ద రైతుల ఆందోళన
ఎండనక, వాననక ఆరుకాలం కష్టపడి పండించిన పంటను సొసైటీల్లో తీసుకోవడం లేదని రైతులు మేడ్చల్ సౌసైటీ కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పలువురు రైతులు మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వల్ల వడ్లు పాడవుతున్నాయన్నారు. మేడ్చల్ సొసైటీ కేంద్రంలో వడ్లు తీసుకునే ఇంచార్జీతో పాటు విధులు నిర్వహిస్తున్న వారు ఏదో ఒక సాకు చూపి వడ్లను తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లు కొనుగోలు చేయకపోవడంతో సొసైటీ కేంద్రం వద్దకు వచ్చిన మేడ్చల్ అగ్రికల్చర్ అధికారిని అర్చనను రైతులు నిలదీశారు. దీనిపై అగ్రికల్చర్ అధికారిని రైతులతో మాట్లాడుతూ తాళ్లు ఎక్కువగా ఉండడం వల్ల వడ్లు తీసుకుంటలేమని తెలిపారు. రైతులు పండించిన వడ్లలో తాళ్లు లేకుండా సొసైటీకి తీసుకురావాలని సూచించారు. అదేవిదంగా రైస్ మిల్లుల్లో అమ్ముకునే రైతుల కోసం రైస్ ముల్లు యజమానులతో ఫోన్ లో అగ్రికల్చర్ అధికారి మాట్లాడారు. రైతులు పండించిన వడ్లను కొనాలని కోరగా 2, 3 శాతం తాళ్లు ఉంటే కొంటామని, తాళ్లు ఎక్కువ లేకుండా చూసుకోవాలని సమాదానం ఇచ్చారు. సౌసైటీ ఛైర్మన్ రణదీప్ రెడ్డి మాట్లాడుతూ తాళ్లు ఎక్కువగా ఉండడం వల్ల వడ్లు తీసుకోలేక పోతున్నామని, తాళ్లు లేకుండా వడ్లు సొసైటీకి తీసుకురావాలని కోరారు. అదేవిదంగా రైతులు తాళ్లు కొలిచేందుకు తాళ్లు కొలిచే మిషన్ కొరత వల్ల రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమణారెడ్డి మాట్లాడుతూ సొసైటీ కేంద్రాలు, రైస్ మిల్లు యజమానులు చేసే తప్పుల వల్ల ప్రభుత్వంపై భారం పడుతుందన్నారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని రైస్ మిల్లు యజమానులు, సొసైటీ కేంద్రాల వద్ద ఇంచార్జీలు పలు కారణాలు చెప్పి వడ్లు కొనడం లేదని ఇది ప్రభుత్వంపై బురద చల్లడమే అవుతుందన్నారు.