కంటిమీద కునుకులేదు.. ఇంటి వైపు చూసింది లేదు..
- భారీ వర్షాలకు కమిషనర్లంతా రోడ్లపైనే..
జలమయమైన ప్రాంతాల్లో పర్యటన..
వాటర్ పూర్తిగా తొలగించాకే ఇంటికి చేరిన అధికారులు..
By. V. Krishna kumar
Tpn: స్పెషల్ డెస్క్..
భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అయిపోయింది. ఎక్కడ చూసినా వర్షం నీరే. పలు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లు, బస్తీలు చెరువులను తలపించాయి. మున్సిపల్ మాట దేవుడెరుగు.. హైడ్రా, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసుల పనితీరు జనాల ప్రాణాలు కాపాడాయి. వర్షం నీటిలో చిక్కుపోయిన జనాలను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చారు పోలీసులు. ఇక కమిషనర్ల విషయానికి వస్తే ఏ అధికారికి కంటిమీద కునుకు లేదు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ నీట మునిగిన ప్రాంతాల్లో తమ సిబ్బందితో కలిసి పర్యటించారు. వాటర్ తొలగించే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. ప్రతి సిబ్బంది సిటీ మొత్తం సేఫ్ గా ఉండేలా చేశారు. ఏ ఒక్కరి ప్రాణాలకు గాని, ఆస్తి నష్టం వాటిల్లకుండా నానా ప్రయత్నాలు చేశారు. కొన్ని ప్రాంతాల్లో రంగనాథ్ నీటి తోడేందుకు స్వయంగా సిబ్బందితో కలిసి పనిలో నిమగ్నమయ్యారు.
ఇక హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ సైతం కమాండ్ కంట్రోల్ లో కనురెప్ప వేయకుండా ఎప్పటికప్పుడు సిబ్బంది అలర్ట్ చేస్తూ వున్నారు. సిసి కెమెరాల ద్వారా వాటర్ నిలిచి పోయిన ప్రాంతాలను గుర్తించడం అక్కడి సిబ్బందిని అప్రమత్తం చేశారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో తమ తోటి అధికారులతో కలిసి ట్రాఫిక్ సజావుగా సాగేలా ప్రయత్నాలు చేశారు. ఇలా కమిషనర్ స్థాయి అధికారులు వర్షాలకు తెల్లవార్లు ఇంటిముఖం పట్టకుండా స్వయంగా ఆయా ప్రాంతాల్లో తెల్లవార్లు పని చేయడం ఇదే మొదటిసారి. వర్షం భయం.. నీటితో వణుకు పుట్టిన సిబ్బందికి కమిషనర్లు కానరావడం కాస్త గుండెల్లో ధైర్యం నింపిందనే చెప్పాలి.
మరోసారి తెలంగాణకు అందులో ముఖ్యంగా హైదరాబాద్ కి వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ కోస్తాంధ్ర తీరం వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. నేడు, రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ప్రధానంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, కుమురం భీం ఆసిఫాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, జనగామ, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఇక శనివారం రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, ఖైరతాబాద్, ముషీరాబాద్, సైదాబాద్, హిమాయత్‌నగర్, అంబర్‌పేట ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లక్డీకాపూల్ నుంచి కంట్రోల్‌రూం, నాంపల్లి, మొజంజాహీమార్కెట్ వరకు రహదారులకు ఇరువైపులా వరద కారణంగా వాహనాలు నిలిచిపోయాయి. కేసీపీ కూడలి, పంజాగుట్ట, అమీర్‌పేట, మైత్రీవనం, ఎర్రగడ్డ వంటి ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు వరద నీరు చేరింది. దీంతో వాహనాలు ముందుకు కదలలేకపోయాయి.
వర్షపాతం వివరాలు చూస్తే..
తొర్రూర్‌లో అత్యధికంగా 13 సెం.మీల వర్షం నమోదైంది. బేగంబజార్‌లో 11.8 సెం.మీల వర్షపాతం రికార్డయింది. పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. ప్రధాన దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కుండపోత వానలు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి.
ఈ వర్షాలకు మూసీ నదిలో వరద ప్రవాహం పెరగడంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి భారీ వర్షాల హెచ్చరికలు జారీ కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం, పాత, శిథిలావస్థలో ఉన్న భవనాల కింద ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.