హమ్మయ్య సిటీలో ఇక పార్కింగ్ కష్టాలు లేనట్లే..
- పార్కింగ్ కష్టాలు తీర్చే దిశగా అడుగులు..
ఆటోమేటెడ్ బహుళ అంతస్తుల పార్కింగ్ వ్యవస్థ సిద్ధం..
నాంపల్లిలో 1st పేజ్ సిద్ధం చేసిన అధికారులు..
By. V. Krishna kumar
Tpn: స్పెషల్ డెస్క్
నగరంలో పార్కింగ్ కష్టాలు తీర్చే దిశగా ప్రారంభమైన ప్రాజెక్టు తుదిమెరుగులు దిద్దుకుంటోంది. ప్రపంచంలోనే అరుదుగా ఉండే పూర్తిస్థాయి ఆటొమేటెడ్ బహుళ అంతస్తుల పార్కింగ్ వ్యవస్థ సిద్ధమవుతోంది...దేశంలోనే మొట్ట మొదటి అత్యంత ఆధునిక ఆటోమేటెడ్ పార్కింగ్ ప్రాజెక్ట్ గా ఈ కాంప్లెక్స్ క్రెడిట్ కొట్టేయబోతోంది .. ఈ మోడల్ సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో ఇలాంటి పార్కింగ్ స్లాట్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.. ఇంతకీ ఈ కాంప్లెక్స్ ఎక్కడ దీని ప్రత్యేకతలేంటో మీ ట్రూ పాయింట్ న్యూస్ లో..
హైదరాబాద్ లో పార్కింగ్ కష్టాలను తీర్చే ప్రాజెక్టుకు తుది మెరుగులు దిద్దుతోంది హైదరాబాద్ మెట్రో రైల్. దేశంలోనే మొట్టమొదటిసారి పూర్తిస్థాయి ఆటొమేటెడ్ బహుళ అంతస్తుల పార్కింగ్ వ్యవస్థ నాంపల్లి లో ప్రారంభానికి సిద్ధమవుతోంది.. నాంపల్లి లో జరుగుతున్న ఈ ప్రాజెక్టు పనులను పరిశీలించారు మెట్రో ఎండి NVS రెడ్డి.. వివిధ ప్రభుత్వ శాఖల నుండి తుది అనుమతులు లభించిన వెంటనే త్వరలోనే ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది.. హెచ్ఎంఆర్ఎల్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును పీపీపీ విధానంలో నోవమ్ సంస్థ చేపట్టింది.. ఇది జర్మనీకి చెందిన అత్యాధునిక ‘పాలిస్‘ సాంకేతికతతో పూర్తి ఆటోమేటెడ్ పజిల్ పార్కింగ్ సిస్టమ్ గా నిర్మించబడింది.
హెచ్ఎంఆర్ఎల్ రెండువేల చదరపు గజాల స్థలాన్ని 50 సంవత్సరాల కన్సెషన్ కు ఇవ్వగా, ప్రాజెక్టు డెవలపర్లు 102 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. మొత్తం 15 అంతస్తులు కలిగిన ఈ పార్కింగ్ ప్రాంగణంలో 3 బేస్‌మెంట్లు, 7 పైఅంతస్తులు కలిపి మొత్తం 10 పార్కింగ్ అంతస్తులు ఉంటాయి. వీటితో పాటు 5 వాణిజ్య పరమైన కార్యకలాపాల కోసం కేటాయించారు. ఈ కాంప్లెక్స్ లో రెండు సినీథియేటర్లు కూడా ఉన్నాయి. 11వ అంతస్తులో నగర వీక్షణ కోసం ప్రత్యేకంగా ఒక గ్యాలరీని ఏర్పాటు చేశారు.. ఈ మల్టీ పార్కింగ్ అంతస్తులలో మొత్తం 250 కార్లు, 200 ద్విచక్ర వాహనాల పార్కింగ్ చేయవచ్చు. పూర్తిస్థాయిలో సెన్సార్ల సహాయంతో ఆటోమేటెడ్ పజిల్ పార్కింగ్ విధానం ఉంటుంది. ఇది SUVలు, సెడాన్‌లు, చిన్న కార్లను వాటి పరిమాణం ఆధారంగా వేరు చేసి, వాటికి కేటాయించిన అంతస్తుల్లో పార్క్ చేయడం ఇక్కడ ప్రత్యేకత.
ఢిల్లీ, ముంబై నగరాలలో ఉన్న కొద్దిపాటి మెకానికల్ పార్కింగ్ కాంప్లెక్సుల వలే కాక, ఇక్కడ ప్యాలెట్ లేకుండా ఉండటం వల్ల పార్కింగ్ అత్యంత సౌలభ్యంగా ఉంటుంది. వాహనాలు లోపలికి, బయటకు వచ్చే టెర్మినళ్లు విశాలంగా ఉండి, స్మార్ట్ గా పని చేస్తాయని అంటున్నారు మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి. వృద్ధులు,మహిళలు, వికలాంగులకు అనుకూలంగా ఉండేలా ఫ్లాట్ టెర్మినల్స్ ఉంటాయి. వాహనాలను ఎటువంటి కోణంలో విడిచి పెట్టి వెళ్లినా, 360 డిగ్రీలు తిరిగగలిగే ప్యాలిస్ టేబుల్ స్వయంగా దానిని సరైన విధానంలో పెట్టి పార్కింగ్ చేస్తుంది. . ప్రవేశద్వారంలో QR కోడ్ ఉన్న టికెట్ సూచనలతో ఇన్/అవుట్ టెర్మినల్‌కు చేరుకున్న వెంటనే, కార్డును స్వైప్ చేస్తే టెర్మినల్ గేట్ తెరుచుకుంటుంది. డ్రైవర్ టర్న్‌టేబుల్ మీద కారును నిలిపివేసి హ్యాండ్ బ్రేక్స్ వేసి, ఇంజిన్ ఆఫ్ చేసి, బయటకు వస్తే సరిపోతుంది. టెర్మినల్ బయట కార్డును స్వైప్ చేయగానే పార్కింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
వినియోగదారుడు ఫీజు చెల్లించే కౌంటర్ లో రుసుము ఇచ్చిన తర్వాత, సూచించిన ఐ/ఓ టెర్మినల్ వద్దకు వెళ్లి కార్డును స్వైప్ చేయగానే, పార్కింగ్ ప్లాట్ ఫామ్ నుండి వాహనం వినియోగదారుని వద్దకు చేరుకుంటుంది. ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ నగర ప్రజలు ప్రపంచ స్థాయి పార్కింగ్ అనుభవాన్ని పొందనున్నారు.