సాయి సూర్య డెవలపర్స్ 'రియల్' మోసం.. హీరో మహేష్ బాబుకు నోటీసులు

On
సాయి సూర్య డెవలపర్స్ 'రియల్' మోసం.. హీరో మహేష్ బాబుకు నోటీసులు

  • ఓ రియల్ ఎస్టేట్ సంస్థ మోసం కేసులో నటుడు మహేశ్ బాబుకు నోటీసులు

రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ జారీ చేసిన ఆదేశాలు

సాయి సూర్య డెవలపర్స్ సంస్థ, దాని యజమానితో పాటు మహేశ్‌ను ప్రతివాదిగా చేర్చిన బాధితులు

మహేశ్ ఫొటోతో ఉన్న బ్రోచర్ చూసి మోసపోయామని ఫిర్యాదులో వెల్లడి..

నేడు విచారణకు హాజరు కావాలని ముగ్గురికీ కమిషన్ ఆదేశం

By. V. Krishna kumar

349968-unnamedTpn: స్పెషల్ డెస్క్.

సినీ నటుడు మహేశ్ బాబుకు ఓ రియల్ ఎస్టేట్ వివాదంలో చిక్కులు ఎదురయ్యాయి. ఓ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించినందుకు గాను, రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ చేసిన మోసానికి సంబంధించి దాఖలైన ఫిర్యాదులో మహేశ్ బాబు పేరును మూడో ప్రతివాదిగా చేర్చారు.
హైదరాబాద్‌కు చెందిన ఓ వైద్యురాలు, మరో వ్యక్తి కలిసి ‘మెస్సర్స్ సాయి సూర్య డెవలపర్స్’ అనే సంస్థపై వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. బాలాపూర్ గ్రామంలో ఆ సంస్థ వేసిన వెంచర్‌లో చెరో ప్లాట్‌ కొనుగోలు చేసేందుకు రూ. 34.80 లక్షలు చెల్లించినట్లు వారు తమ ఫిర్యాదులో తెలిపారు.
సదరు సంస్థకు మహేశ్ బాబు ప్రచారకర్తగా ఉన్నారని, ఆయన ఫొటోతో ఉన్న బ్రోచర్‌లోని ఆకర్షణీయమైన హామీలు, అన్ని అనుమతులు ఉన్నాయన్న మాటలు నమ్మి తాము డబ్బు చెల్లించామని బాధితులు పేర్కొన్నారు. అయితే, ఆ తర్వాత అక్కడ ఎలాంటి లేఅవుట్ లేదని తెలుసుకుని, తాము మోసపోయామని గ్రహించారు. తమ డబ్బును తిరిగి ఇవ్వాలని సంస్థ యజమాని కంచర్ల సతీశ్‌ చంద్రగుప్తాను కోరగా, ఆయన అతికష్టం మీద వాయిదాల పద్ధతిలో కేవలం రూ. 15 లక్షలు మాత్రమే తిరిగిచ్చారని వాపోయారు.
మిగిలిన డబ్బు కోసం ఒత్తిడి చేయగా, యజమాని ముఖం చాటేయడంతో బాధితులు కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ కేసులో సదరు సంస్థను, దాని యజమానిని, ప్రచారకర్తగా ఉన్న మహేశ్ బాబును ప్రతివాదులుగా చేర్చారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన కమిషన్, ఈ కేసుకు సంబంధించి సోమవారం విచారణకు హాజరు కావాలని ముగ్గురికీ నోటీసులు పంపింది.

Advertisement

Latest News