చోరీ చేసిన సొత్తుతో ఆన్ లైన్ బెట్టింగ్.. ముగ్గురు అరెస్ట్
మేడ్చల్ జిల్లా: జీడిమెట్లలో ఇంట్లో చోరీ చేసిన సొత్తును ఆన్లైన్ బెట్టింగ్ లో ఇన్వెస్ట్ చేస్తూ జల్సా చేస్తున్న నిందితులను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సోమవారం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో బాలనగర్ ఏసిపి నరేష్ రెడ్డి వివరాలను వెల్లడించారు. జీడిమెట్ల ఎస్సార్ నాయక్ నగర్ కు చెందిన సంగమేష్ (35) పాల వ్యాపారి. ఈనెల రెండవ తేదీన పటాన్చెరులో ఓ ఫంక్షన్ కు వెళ్లాల్సి ఉండటంతో, అతను తిరిగి రావటానికి రాత్రి అవుతుందని ఎస్సార్ నాయక్ నగర్ లో ఉన్న తన ఇంటికి ఫోన్ చేసి తాను రావడానికి లేట్ అవుతుంది కాబట్టి ఇంటి తలుపులకు లాక్ వేయకుండా ఉంచాలని సూచించాడు. ఈ విషయాన్ని తన వద్ద పనిచేస్తున్న ఆసిఫ్ వినడం జరిగింది. ఇదే అదనంగా భావించిన ఆసిఫ్ తన స్నేహితులు అయిన మహమ్మద్ ఆసిఫ్, మహమ్మద్ అమీర్ లు సంగమేష్ ఇంటికి వెళ్లారు. తలుపులు దగ్గరికి వేసి ఉండటంతో ఇంటిలో దాచి ఉంచిన మూడున్నర లక్షల రూపాయలు తో పాటుగా ఒక ఫోన్ ను దొంగలించి పారిపోయారు. కాగా వీరు దొంగతనం చేసి బయటికి వస్తున్న క్రమంలో సంగమేష్ కూతురు రిషిక వారిని చూడడం జరిగింది. అర్ధరాత్రి తర్వాత సంగమేష్ ఇంటికి రావడంతో విషయాన్ని తెలుసుకొని మూడో తేదీన జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన జీడిమెట్ల డిటెక్టివ్ సిఐ ఎస్. కనకయ్య తన బృందంతో కలిసి సంఘటన ప్రాంతం నుంచి 5 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న 130 సీసీ కెమెరాలు క్షుణ్ణంగా పరిశీలించారు. దొంగతనంలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్లుగా, వారిలో ఒక వ్యక్తి సంగమేశ్ వద్దనే పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. అయితే దొంగలించిన మొబైల్ ఫోన్ ని అమ్మేయడానికి నిందితులు ద్విచక్ర వాహనంపై షాపూర్ నగర్ కి వచ్చారు. వాహన తనిఖీలు చేస్తున్న క్రమంలో వీరి బండిని ఆపి ప్రశ్నించగా తగిన డాక్యుమెంట్స్ చూపించడంలో ఫెయిల్ అయ్యారు. అనుమానం వచ్చిన పోలీసులు స్టేషన్ కు తరలించి విచారించగా తాము చేసిన దొంగతనాన్ని ఒప్పుకున్నారు. దీంతో నిందితుల వద్ద నుంచి రూ 2 లక్షల 15 వేల రూపాయలు, నాలుగు మొబైల్ ఫోన్స్, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. అయితే నిందితులు ఆన్లైన్ బెట్టింగ్ లో చోరీ చేసిన డబ్బును ఇన్వెస్ట్ చేశారని, గతంలో ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా డబ్బులు పోగొట్టుకొని ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారని పోలీసులు తెలిపారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ సీఐ గడ్డం మల్లేష్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కనకయ్య, డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ శ్యాంబాబు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్, కానిస్టేబుళ్లు ప్రేమ్ కుమార్, నరేష్, మోహన్, రాజ్ కుమార్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.