ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ ప్రమాదం.. 7గురు మృతి

On
ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ ప్రమాదం.. 7గురు మృతి

అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఘటన విస్మరించకముందే మరో దుర్ఘటన సంభవించింది. ఉత్తరాఖండ్ లో ఓ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడు మంది భక్తులు దుర్మరణం పాలైనట్లు సమాచారం అందుతోంది. వీరందరూ కూడా కేదార్ నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి బయలుదేరిన భక్తులుగా అధికారులు వెల్లడించారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ నుంచి బయలుదేరిన ఈ హెలికాప్టర్ తొలుత మిస్సింగ్ అయింది. గుప్తకాశీ-త్రిజుగి నారాయణ్- గౌరీకుండ్ గగనతలంపై వెళ్తున్నప్పుడు రాడార్ నుంచి అదృశ్యం అయింది. ఆ తరువాత ఈ హెలికాప్టర్ ఘోర ప్రమాదానికి గురైనట్లు సమాచారం అందింది. మరణించిన వారిలో హెలికాప్టర్ పైలెట్ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ తెల్లవారు జామున ఈ దుర్ఘటన సంభవించింది. తెల్లవారు జామున 5 గంటలకు ఉత్తరాఖండ్ ఎయిర్ పోర్ట్ నుంచి ఈ హెలికాప్టర్ కేదార్ నాథ్ కు బయలుదేరింది. 5:20 నిమిషాల సమయంలో మార్గమధ్యలో రుద్రప్రయాగ జిల్లా గుప్తకాశీ- గౌరీకుండ్ వద్ద ప్రమాదానికి గురైంది. గౌరీకుండ్ సమీపంలో పర్వతాలపై కుప్పకూలింది. ఈ ఘటనలో హెలికాప్టర్ లో ప్రయాణిస్తోన్న ఆరుమంది భక్తులు, పైలెట్ దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో రెండు సంవత్సరాల చిన్నారి కూడా ఉన్నారు.

మహారాష్ట్రకు చెందిన రాజ్ కుమార్ జైస్వాల్, శ్రద్ధా జైస్వాల్, వారి రెండేళ్ల కుమారుడు కాశీ జైస్వాల్ గా గుర్తించారు. ఉత్తరాఖండ్ కు చెందిన పవన్ నేగి, ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన విక్రమ్ సింగ్ రావత్ ఉన్నారు. హెలికాప్టర్ కేప్టెన్ రాజీవ్ మరణించిన వారిలో ఉన్నారు. రావత్.. బద్రినాథ్- కేదార్ నాథ్ టెంపుల్ కమిటీ ఉద్యోగిగా చెబుతున్నారు. సమాచారం అందిన వెంటనే జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ దుర్ఘటన పట్ల ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని వివరించారు.

మూడు రోజుల వ్యవధిలో ఇది రెండో ఎయిర్ ట్రాజెడీ. ఈ నెల 12వ తేదీన అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. మరణించిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ ఉన్నారు. ఈ విషాదం నుంచి తేరుకోక ముందే మరో ప్రమాదం సంభవించడం చర్చనీయాంశమౌతోంది.

Advertisement

Latest News