పోలవరంలో పేకాట డెన్.. రోజుకు 10 కోట్లు.. నిర్వాహకుడు ఎమ్మెల్యే

By PC RAO
On
పోలవరంలో పేకాట డెన్.. రోజుకు 10 కోట్లు.. నిర్వాహకుడు ఎమ్మెల్యే

పోలవరం ఏజెన్సీలో జోరుగా జూదం

ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే పేకాట డెన్

హెచ్చరించినా తీరు మార్చుకోని ప్రజాప్రతినిధి

మీకు డబ్బులు బాగా ఎక్కువయ్యాయా... పేకాట ఆడుకుంటారా.. ఎక్కడ సేఫ్.. ఎక్కడైతే పోలీసులు రారో మేం చెబుతాం. అక్కడకెళ్లి ఆడుకోండి. అంత సేఫ్ ఎలా అనుకోకండి.. సాక్షాత్తూ ఎమ్మెల్యేగారే మీకు కాపలా కాస్తారు. సేకాట క్లబ్ ఏ టౌన్ హాల్ లోనో... ఏ బిల్డింగులోనో కాదు... ఎంచక్కా ప్రకృతి కూడా బాగుండే అటవీ ప్రాంతంలో వరూ డిస్ట్రబ్ చేయని చోట డెన్ ఏర్పాటు చేశారు. అక్కడకెళ్లి ఆడుకుంటే .. మీకు పండగే. నో డౌట్.. ఈగ కూడా మీకు తెలియకుండా లోపలికి రాదు. ఆ ప్రాంతమంతా ఎమ్మెల్యేగారు పహారా పెట్టించేశారు. ఇన్ని ఏర్పాట్లు చేశాక.. పేమెంట్ కూడా ఆ రేంజులో ఉంటుందిలెండి. మీరు ఎక్కడివాళ్లయినా పర్వాలేదు.. తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్ గడ్.. దూరం అవుతుందని ఫీల్ కాకపోతే బెంగళూరు నుంచి కూడా రావొచ్చు. ఇదంతా అక్కడ ఉండే స్థానికులు చెబుతున్న మాట. ఇందులో ఎంతవరకు నిజముందో వెరిఫై చేయాలి.

బర్రింకలపాడు, జీలుగుమిల్లి మండలం, పశ్చిమగోదావరి జిల్లా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇదే లొకేషన్. ఇది పోలవరం నియోజకవర్గం కిందకు వస్తుంది. ఎమ్మెల్యే పేరు బాలరాజు. సార్ కి ఒక రైట్ హ్యాండ్ ఉన్నాడు.. ఇలాంటి హ్యాండ్ టు హ్యాండ్ వ్యవహారాల్లో ఎక్స్ పర్ట్ అని చెప్పుకుంటున్నారు. ఆయన పేరు కుమారబాబు. డైరెక్టర్ బాలరాజుగారు అయితే.. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుమారబాబుగారు. ఇంతకీ బర్రింకలపాడు ఎమ్మెల్యే బాలరాజుగారి ఊరే. ఈ మధ్యే కొత్త ఆఫీసు, కొత్త ఇల్లు కట్టించారు. బాగుంటాయంట.

ముందు గారపాటి మకాం అని ఈ ఊరుకి కాస్త దగ్గర్లోనే ఉంది. అక్కడే పెట్టారంట. అయితే ఎస్పీగారు వార్నింగ్ ఇవ్వడంతో.. కొత్త ప్లాన్.. అది కూడా చాలా క్రియేటివ్ ప్లాన్ ముందు కార్లు అన్నీ ఎమ్మెల్యే గారి కొత్త ఆఫీసు దగ్గరికి వస్తాయి. అక్కడే కార్లు పెట్టేసి.. అందరూ దగ్గరే ఉన్న ఎమ్మెల్యే గారి పాత ఇంటిలోకి వెళ్లి సిటింగ్ వేస్తారు. అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారంట. అక్కడే ఇక పేకాట రాత్రి, పగలు నడుస్తుందంటున్నారు. ఇక ఆడుకునేవారి ఓపిక అంతే. ఒక్క రోజులో 10 కోట్లు ఆట నడిచిందంటే అర్ధం చేసుకోండి ఏ రేంజులో నడుస్తుందో. ఇలా 15 రోజుల నుంచి నడుస్తుంది తంతు అంటున్నారు స్థానికులు. పైగా కార్లు ఛత్తీస్ గడ్ నుంచి కూడా వస్తున్నాయంట.

మొత్తం వ్యవహారం కుమారబాబు చూసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేగారు పొద్దున్న సాయంత్రం అక్కడ అటెండెన్స్ వేసేసి.. మిగతా టైములో బయటికెళ్లి ఆయన పనులు ఆయన చూసుకుంటున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం లేదా.. లేక ఉన్నా ధైర్యం లేక ఆగిపోతున్నారా... ధైర్యం ఉన్నా.. ఆ ధైర్యాన్ని ఎమ్మెల్యేగారు కొనేశారా ఏమీ అర్ధం కావడం లేదంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు పరిశీలించి నిజానిజాలు బయటపెట్టి.. అసలు ఎమ్మెల్యేగారికి ఏ సంబంధం లేకపోతే.. అసలువాళ్లను పట్టుకుని.. బాలరాజుగారి పరువు కాపాడాలని స్థానికులు బలంగా కోరుతున్నారు.

Advertisement

Latest News